ఛత్తీస్ ఘడ్ లో దారుణం

ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రంలో చాలా దారుణం జరిగింది. ఆ రాష్ట్రంలో సుకుమా జిల్లాలో బుర్కాపాల్-చింతాగుఫా అనే ప్రాంతంలో గస్తీలో ఉన్న సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. వారి దాడిలో 26 మంది జవాన్లు మృతి చెందారు మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. జవాన్లపై దాడి చేసి వారి ఆయుధాలు కూడా ఎత్తుకుపోయారని బస్తర్ జిల్లా డి.ఐ.జి. సుందర్ రాజు దృవీకరించారు. గాయపడిన జవాన్లను హెలికాఫ్టర్లలో రాయ్ పూర్ లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడి సోమవారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు జరిగింది. దాడిలో చనిపోయిన వారందరూ సి.ఆర్.పి.ఎఫ్.74వ బెటాలియన్ కు చెందినవారే. ఈ విషయం తెలుసుకొన్న ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పోలీస్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు. తమ సహచరులను పొట్టనపెట్టుకొన్న మావోయిస్టులపై సి.ఆర్.పి.ఎఫ్.జవాన్లు కోపం రగిలిపోతున్నారు. ప్రస్తుతం మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.