అసంతృప్తితో తెరాస కార్యకర్త ఆత్మహత్య!

ప్రతిపక్షాలను ఫిరాయింపులకు ప్రోత్సహించి, వాటిని రాజకీయంగా బలహీనపరిచి తెరాస తాను బలపడుదామనుకొంది. కానీ మహిపాల్ రెడ్డి అనే తెరాస కార్యకర్త ఆత్మహత్య ఈ ఫిరాయింపులతో తెరాసలో అంతర్లీనంగా నెలకొని ఉన్న అసంతృప్తికి అద్దం పడుతోంది. 

మలార్ దేవ్ పల్లి డివిజన్ కు చెందిన తెరాస కార్యకర్త మహిపాల్ రెడ్డి (38) ఆదివారం ఉదయం వాకింగ్ కోసం రాజేందర్ నగర్ వ్యవసాయ విద్యాలయానికి వెళ్ళి అక్కడ ఒక స్తంభానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. అతను వ్రాసిన 3 పేజీల ‘సూసైడ్ నోట్’ లో వ్రాసిన కారణాలు దిగ్బ్రాంతి కలిగిస్తున్నాయి. పార్టీలో అతను ఎంత మానసిక వేదన అనుభవించాడో తెలియజేస్తున్నాయి. తెరాసలో దిగువ స్థాయిలో కూడా ఇంత ఒత్తిడి ఉందంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

అతను మంత్రి కేటిఆర్ ని ఉద్దేశ్యించి వ్రాసిన ఆ లేఖలో స్థానిక కార్పొరేటర్ కు, ఎమ్మెల్యేకు మద్య ఆధిపత్యపోరు వలన పార్టీ శ్రేణులు, ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారని వ్రాశారు. మొదటి నుంచి తెరాసలో పని చేస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతర పార్టీలలో నుంచి కొత్తగా తెరాసలో చేరినవారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని లేఖలో వ్రాశారు. రాజేంద్రనగర్ పరిధిలో తెరాసలో చేరిన తెదేపా నేతలు, కార్యకర్తలకు ఇస్తున్నంత ప్రాధాన్యం తన వంటి తెరాస కార్యకర్తలు ఇవ్వనందుకు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. కనుక మంత్రి కేటిఆర్ ఈ సమస్యపై దృష్టి సారించి తెరాస కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరారు. పార్టీలో చాలామంది కార్యకర్తలు తనలాగే అసంతృప్తితో ఉన్నా మౌనం వహిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తాను జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకొంటున్నానని, అందుకు తన కుటుంబ సభ్యులు క్షమించాలని లేఖలో వ్రాశారు. తెరాస సర్కార్ కు వీలైతే తన కుటుంబాన్ని ఆదుకోవలసిందిగా మహిపాల్ రెడ్డి తన లేఖ ద్వారా కోరారు. 

ఈ సంగతి తెలుసుకొన్న జిల్లాకు చెందిన తెరాస నేతలు, రాష్ట్ర రవాణా మంత్రి మహీందర్ రెడ్డి తదితరులు మహిపాల్ రెడ్డి ఇంటికి చేరుకొని అతని భార్య రాణి, ఇద్దరు పిల్లలకు ధైర్యం చెప్పి వారి కుటుంబానికి అండగా నిలబడుతామని హామీ ఇచ్చారు. 

ఇదివరకు ఒక పరిశ్రమను పెట్టి ఆర్ధికంగా నష్టపోయిన మహిపాల్ రెడ్డి, తెరాసలో కూడా తనకు గుర్తింపు రాలేదనే బాధతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకొన్నట్లు అర్ధం అవుతోంది. ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్నవారు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాము. కానీ ఈవిధంగా పార్టీలో వివక్షకు గురవుతున్నామనే బాధతో ఆత్మహత్య చేసుకోవడం చాలా విచారకరం. ఒక సాధారణ కార్యకర్త స్థాయిలో వ్యక్తి ఇంత ఒత్తిడికి గురవుతున్నప్పుడు ఇక పదవులు, టికెట్స్ ఆశించి భంగపడిన నేతలు ఇంకెంత ఒత్తిడికి గురవుతున్నారో కదా?ఈ సంఘటనపై పోలీసులు ఎలాగు దర్యాప్తు చేసి ఏవో కారణాలు చెపుతారు కానీ పార్టీ కార్యకర్తలలో నెలకొని ఉన్న ఈ అసంతృప్తిని పార్టీ అధిష్టానం గుర్తించి వారికీ న్యాయం చేయవలసి ఉంది.