ఏపిలో తెదేపా ప్రభుత్వంలో భాగస్వామిగా, మిత్రపక్షంగా భాజపా కొనసాగుతున్నప్పటికీ, అప్పుడప్పుడు ఆ పార్టీ నేతలు తెదేపా సర్కార్ కి గట్టిగా చురకలు వేస్తూనే ఉంటారు. తెదేపా పట్ల తరచూ వ్యతిరేకత ప్రదర్శించే భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పోటీలుపడి మరీ ఇసుకను దోచుకొంటున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఇసుక మాఫియా నడుస్తోంది. అయినా వారిని అడ్డుకోవడానికి తెదేపా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే రాష్ట్రంలో సిమెంట్ కంపెనీలు కూడా సిండికేట్ గా మారి కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ప్రధాని నరేంద్ర మోడీని అనకొండ, సన్యాసి అంటూ అవహేళన చేస్తూ కార్టూన్లు వేస్తున్నవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను,” అని అన్నారు.
ఇటీవల చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఒక లారీ ప్రమాదంలో 20మంది మరణించిన సంగతి తెలిసిందే. అది ప్రమాదం కాదని, అక్రమ ఇసుక రవాణాను వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తున్న ఏర్పేడు గ్రామస్తులను భయబ్రాంతులు చేసేందుకు ఇసుక మాఫియా ఈ దారుణానికి ఒడిగట్టిందని వైకాపా ఆరోపిస్తోంది. రాష్ట్రంలో ఇసుకమాఫియా ఆగడాలకు ఇది పరాకాష్టగా చెప్పుకోవచ్చని వైకాపా వాదిస్తోంది. కానీ అది కేవలం ప్రమాదమేనని తెదేపా వాదన. ఈ ప్రమాదంపై వైకాపా శవరాజకీయాలు చేస్తోందని తెదేపా వాదిస్తోంది.
ఏది ఏమైనప్పటికీ, ఈ దుర్ఘటన రాష్ట్రంలో ఇసుక మాఫియా ఉనికిని చాటిచెప్పినట్లయింది. ఇదివరకు కాల్ మనీ వ్యవహారం బయటపడినప్పుడు తెదేపా సర్కార్ చాలా తీవ్ర ఆరోపణలు, ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంది. ఈ ఇసుక మాఫియా కూడా దానికి ఇంకా చెడ్డపేరు తెస్తోంది. ఇటువంటివాటిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపకపోతే వచ్చే ఎన్నికలలో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కనుక మిత్రపక్షం చేస్తున్న ఈ హెచ్చరికలతోనైనా మేల్కొంటే మంచిది.