జనసేనతో కలిసి పనిచేయడానికి రెడీ

జనసేన పార్టీ వచ్చే ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనసేనకు, ఆయనకు ఆంధ్రాలో చాలా మంది అభిమానులున్నందున అక్కడ దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. కానీ తెలంగాణాలో ప్రజలు జనసేనను ఆదరిస్తారనే నమ్మకం లేదు. కారణాలు అందరికీ తెలుసు. కనుక తెలంగాణాలో పోటీ చేయాలనే పవన్ కళ్యాణ్ నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

పవన్ కళ్యాణ్ వామపక్ష భావజాలం కలిగి ఉన్నందున, కమ్యూనిస్ట్, మార్కిస్ట్ పార్టీలు జనసేనతో చేతులు కలుపువచ్చు. ఇటీవల మావోయిష్టులతో సంబంధాలు తెంపుకొని ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన ప్రజాకవి గద్దర్ కూడా జనసేనతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటించారు. 

ఇంతకాలం ఆయుధం ద్వారా మాత్రమే రాజ్యాధికారం వస్తుందని భావించానని కానీ ఆవిధంగా ఇంకా ఎన్ని దశాబ్దాలు పోరాడినా ప్రయోజనం ఉండదని గ్రహించినందునే రాజ్యాధికారం సాధించడం కోసం ప్రజాస్వామ్యవిధానంలోనే కృషి చేయాలనుకొంటున్నట్లు గద్దర్ చెప్పారు. జనసేన అజెండాను అధ్యయనం చేసిన తరువాత ఆ పార్టీతో కలిసిపని చేయాలో వద్దో నిర్ణయించుకొంటానని గద్దర్ చెప్పారు. జనసేనపై ప్రజలలో సదాభిప్రాయం ఉన్నట్లే కనిపిస్తోందని అన్నారు. తెలంగాణా రాష్ట్రాభివృద్ధి కోసం కృషిచేసేవారితో కలిసి పనిచేయడానికి తాను సిద్దంగా ఉన్నట్లు గద్దర్ ప్రకటించారు.

తెలంగాణాలో జనసేనకు గద్దర్ మద్దతు లభిస్తే ఆ పార్టీకి ఎంతో కొంత మేలు జరుగవచ్చు కానీ తెలంగాణాలో పట్టులేని జనసేనతో చేతులు కలిపి రాజ్యాధికారం సాధించగలమని గద్దర్ అనుకొంటే అది సాయుధపోరాటం ద్వారా రాజ్యాధికారం సాధించగలమన్నంత మరో పెద్ద తప్పు అవుతుంది. 

ఇన్నేళ్ళపాటు ప్రజల మద్య ఉండి వర్తమాన రాజకీయాలను, పార్టీ బలాబలాలను, ఎన్నికలలో విజయం సాధించడానికి దోహదపడే అంశాలను, వాస్తవిక పరిస్థితులను గద్దర్ సరిగ్గా అంచనా వేయలేకపోతే అయన రాజకీయాలలో ప్రవేశించి నవ్వులపాలు అవడం కంటే వాటికి దూరంగా ఉండటమే మంచిది. జనసేనకు ఇదే నియమం వర్తిస్తుంది.