ప్రముఖ నటుడు సుమన్ కూడా ప్రత్యక్ష రాజకీయాలలోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఒంగోలులో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో తన రాజకీయ ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిజాయితీతో, చిత్తశుద్ధితో పనిచేసే ఏ పార్టీలోనైనా తను చేరుతానని లేకుంటే మద్దతు పలుకుతానని చెప్పారు.
తరువాత ఆయన చెప్పిన మాటలు వింటే ఆయన జనసేన లేదా వైకాపాలలో ఏదో ఒక దానిని ఎంచుకొనే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, వారి సమస్యలకు పరిష్కరించవలసిన భాద్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉంది. దక్షిణ భారతీయులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలకు ఉప ప్రధానమంత్రిని కేటాయించాలి,” అని అన్నారు.
దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాదివారి కర్ర పెత్తనం, వివక్షచూపడంపై ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడుతున్నారు. అలాగే రైతుల సమస్యలపై జగన్ ఏపి సర్కార్ తో గట్టిగా పోరాడుతున్నారు. కనుక సుమన్ ఈ రెండు పార్టీలవైపే మొగ్గు చూపుతున్నట్లు భావించవచ్చు. ఎన్నికల సమయానికి అప్పటి రాజకీయ సమీకరణాలు, పార్టీ పరిస్థితులు, టికెట్ లభ్యత మొదలైన కూడికలు తీసివేతలు అన్నీ సరిచూసుకొని నచ్చిన పార్టీలోకి సుమన్ రాజకీయ ఆరంగ్రేటం చేయవచ్చు లేదా రిస్క్ అనుకొంటే మద్దతుతో సరిపెట్టుకోవచ్చు.