రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి కేటిఆర్ శనివారం హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. నగరంలోబన్సీలాల్ పెట్ డివిజన్ పరిధిలోని కవాడిగూడ వద్ద రూ.15.57 కోట్లతో మొత్తం 180 డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ తో కూడిన అపార్టుమెంటులు నిర్మించబోతున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ ఈ ఇళ్ళను వీలైనంత త్వరగా నిర్మించి లబ్దిదారులకు అందజేస్తాము. మా ప్రభుత్వం పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించడానికి కృషి చేస్తుంటే, మొన్న ఒక సీనియర్ కాంగ్రెస్ నేత ‘డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఎక్కడ కట్టారో చూపించండి..మాకు కనబడటం లేదు’ అంటూ ఎగతాళి చేస్తూ మాట్లాడారు. హైదరాబాద్ లోనే లక్ష ఇళ్ళు కట్టించాలని ప్రభుత్వం ముమ్ముర ప్రయత్నాలు చేస్తోంది. కనుక ఒక్క ఏడాది సమయం ఇస్తే వాళ్ళకి తప్పకుండా చూపిస్తాము. అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏమీ చేయకపోయినా, మేము చేస్తుంటే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రజలను ఏదోవిధంగా రెచ్చగొట్టి సందు దొరికితే మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది ఆ ముసలి పార్టీ. కనుక ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలి,” అని కేటిఆర్ అన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుతం మంజూరు చేసినవి కాకుండా అదనంగా మరో 95,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను కట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున రాష్ట్రంలో 95 నియోజక వర్గాలలో 95,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను అదనంగా నిర్మించడానికి అనుమతి మంజూరు చేస్తూ తెలంగాణా ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
పాత జిల్లాల ప్రకారం రంగారెడ్డిలో 6,000, మెదక్-9000, వరంగల్-12000, ఖమ్మం-10,000, నల్లగొండ-12,000, కరీంనగర్-13,000, ఆదిలాబాద్-10,000, నిజామాబాద్-9,000, మహబూబ్ నగర్-14,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అదనంగా మంజూరు అయ్యాయి.