త్వరలో మళ్ళీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత జి.ఎస్.టి., హెరిటేజ్,రిజర్వేషన్ల బిల్లులు ఆమోదించేందుకు ఒక్కరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈనెల 27న వరంగల్ బహిరంగ సభ తరువాత మళ్ళీ ఒక్కరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న తెరాస ప్లీనరీ సభలో ప్రకటించారు.

నకిలీ విత్తనాల తయారు చేస్తున్న కంపెనీలపై, వాటిని అమ్ముతున్న వ్యాపారులపై పిడి యాక్ట్ క్రింద కటినమైన చర్యలు తీసుకొనేందుకు చట్ట సవరణ చేయాలనుకొంటున్నట్లు చెప్పారు. కల్తీ విత్తనాల వలన రైతులు ఎంత నష్టపోయారో ఆ నష్టాన్ని ఆ నకిలీ విత్తనాలు తయారు చేసిన కంపెనీల నుంచి రాబట్టే విధంగా చట్టంలో నిబంధన ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. దీని కోసం ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నామని కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఇంకా ప్రోరోగ్ కాలేదు కనుక ఈనెల 27 తరువాత ఎప్పుడైనా ఒకరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ చట్టాని ప్రవేశపెట్టాలనుకొంటున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.