రాజకీయ నేతల మద్య విమర్శలు ఒక స్థాయి దాటితే వారి నోటితోనే వారు తమ గురించి సామాన్య ప్రజలు ఎవరికీ తెలియని తమ బండారం బయటపెట్టుకొంటారు. అది విని ప్రజలు ‘ఔరా!’ అని ముక్కున వేలేసుకొంటారు. భువనగిరి-యాదాద్రి జిల్లాలకు కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ నల్గొండ జిల్లా నేతలతో నిన్న చర్చిస్తున్నప్పుడు, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, పిసిసి కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డికి మద్య జరిగిన ఈ వాగ్వాదం వింటే అది అర్ధం అవుతుంది.
నారాయణ రెడ్డి: యాదాద్రి డిసిసి అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యని నియమిస్తే బాగుంటుంది.
దిగ్విజయ్ సింగ్: రాజగోపాల్ రెడ్డీ...మీరేమంటారు?
రాజగోపాల్ రెడ్డి: మీరు నా మాటకు విలువిచ్చి నేను చెప్పిన వాడికే ఆ పదవి ఇస్తానంటేనే చెపుతాను.
నారాయణ రెడ్డి: అయన సలహా మనకు అక్కరలేదు. ఆయన కాంట్రాక్టులు చేసి కోట్లు సంపాదించి దానితో రాజకీయాలు చేస్తుంటాడు.
రాజగోపాల్ రెడ్డి: నేను నిజాయితీగా కాంట్రాక్టులు చేసుకొని డబ్బు సంపాదించుకొంటాను. కానీ నువ్వొక రాజకీయ బ్రోకరువి. ఆ సంగతి అందరికీ తెలుసు. నువ్వు గ్యాంగ్ స్టర్ నయీంతో కలిసి అక్రమ భూదందాలు చేశావు. నువ్వా నన్ను విమర్శించేది?
దానితో వారి మద్య గొడవ ఇంకా పెరగడంతో రాజగోపాల్ రెడ్డి ఆవేశంతో ఊగిపోతూ దిగ్విజయ్ సింగ్ చూస్తుండగానే నారాయణ రెడ్డి చెంప చెళ్ళుమనిపించారు. దిగ్విజయ్ సింగ్ ముందే ఇరు వర్గాలు చిన్న సైజు యుద్ధం చేశాయి. అతి కష్టం మీద వారిని శాంతింపజేశారు.
కాంగ్రెస్ నేతల గొప్పదనం వారి నోటితోనే చెప్పుకొన్నారు. కాంగ్రెస్ నేతలు పదవుల కోసం కీచులాడుకోకుండా ఉండలేరని ఈ సంఘటన ద్వారా మరోసారి రుజువైంది.