ఏడాదికి రెండుసార్లు ఉచిత ఎరువు పంపిణీ

ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రగతి భవన్ లో వ్యవసాయశాఖా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆ శాఖా ఉన్నతాధికారులతో సమావేశమయ్యి వ్యవసాయం, రైతుల సంక్షేమం గురించి లోతుగా చర్చించారు.  “రాష్ట్రంలో రైతులందరూ ధనవంతులుగా మారినప్పుడే అది మనకు గర్వకారణం అవుతుంది. కనుక ఆ దిశలో రైతులను ముందుకు నడిపించేందుకు మన ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం రైతులపై చాల భారం ఉంటోంది. దానిని ప్రభుత్వం కూడా పంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే అందరికీ ఉచితంగా ఎరువులు పంపిణీ చేయాలనీ నిర్ణయించాము. పండ్లతోటల రైతులకు కూడా ఉచితంగా ఎరువులు అందిస్తాము. ప్రతీ ఏడాది రెండు పంటలకి ఉచిత ఎరువుల కొనుగోలుకు ఎకరానికి రూ.4,000 చొప్పున రాష్ట్రంలో ప్రతీ రైతుకి అందజేస్తాము. రైతుల కోసం ఎన్ని వేలకోట్లయినా ఖర్చు చేయడానికి మన ప్రభుత్వం వెనుకాడదు,” అని అన్నారు.

రైతులకు మద్దతు ధర, వారి ఉత్పత్తులను నిలువ చేసుకోవడానికి సరిపడినన్ని గోదాముల నిర్మాణం, మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని కేసీఆర్ చెప్పారు. వ్యవసాయంలో ఆధునిక పరిజ్ఞానం వినియోగించుకోవడం, డిమాండ్, నీటి లభ్యతను బట్టి పంటలను వేసుకోవడం వంటి విషయాలలో రైతులకు సహాయపడేందుకు ప్రతీ 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాదికారిని నియమిస్తామని తెలిపారు. వ్యవసాయంలో అత్యాధునిక పరిజ్ఞానం, మెళకువలను ఉపయోగించి అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక దిగుబడి సాధిస్తున్న ఇజ్రాయెల్ దేశానికి వ్యవసాయ శాఖ అధికారులను పంపిస్తానని కేసీఆర్ చెప్పారు.

నకిలీ విత్తనాలను అమ్మేవారిపై కటినమైన చర్యలు తీసుకొనేందుకు వీలుగా పిడి యాక్ట్ క్రింద కెసూ నమోదు చేయాలని భావిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. అవసరమైతే ఈ సమస్యను శాస్వితంగా అరికట్టేందుకు ప్రత్యేకంగా మరో చట్ట రూపొందించుకొందామని కేసీఆర్ అన్నారు.