కొంపల్లిలో నేడు జరుగబోయే తెరాస ప్లీనరీ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి తెరాస కార్యకర్తలు బారీగా తరలిరాబోతున్నారు. కనుక వారి కోసం తెరాస చాల బారీ ఏర్పాట్లే చేసింది. బయట ఎండలు మండి పోతున్నా లోపల మాత్రం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నారు. మొత్తం 200 ఏసీలను ఏర్పాటు చేశారు. సమావేశంలో పాల్గొంటున్న కార్యకర్తల దప్పిక తీర్చడానికి లక్ష మంచినీళ్ళ బాటిల్స్, మరో లక్ష మజ్జిగ ప్యాకెట్స్ ను సిద్దం చేసి ఉంచారు. సమావేశం ముగిసేవరకు వాటిని కార్యకర్తలకు అందించేందుకు వెయ్యి మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. వారందరికీ వాకీ టాకీలు కూడా అందించడం విశేషం.
ఇక మధ్యాహ్నం విందు భోజనంలో 26 రకాల వంటకాలు సిద్దం చేస్తున్నారు. వాటిలో హైదరాబాద్ బిర్యాని మొదలు అచ్చమైన తెలంగాణా వంటకాల వరకు అన్నీ ఉంటాయి. ఈ సమావేశానికి హాజరవుతున్న వారందరూ ఒకేసారి భోజనం చేయడానికి వీలుగా 6 భోజనశాలలు ఏర్పాటు చేశారు. అందరికీ ఒకేసారి ఆహారం వడ్డించడానికి వేరేగా వాలంటీర్లను ఏర్పాటు చేశారు. మళ్ళీ సాయంత్రం ఛాయ్, నాస్తాలు కూడా అందించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.