ప్రభుత్వం అంతా కొంపల్లిలోనే..

గత 2-3 రోజులుగా తెరాస సర్కార్ లో మంత్రులు, అధికారులు, వివిధ కార్పోరేషన్ చైర్మన్లు అందరూ కొంపల్లిలోనే మకాం వేసి నేడు జరుగబోయే తెరాస ప్లీనరీ సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహేందర్‌రెడ్డి, జి.హెచ్.ఎం.సి. మేయర్ బొంతు రామ్మోహన్ స్వయంగా దగ్గరుండి ప్లీనరీకి అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

తెరాస ఎమ్మెల్యేలు  బాల్క సుమన్, మాధవరం కృష్ణారావు, వివేకానంద, ఎంపీలు మల్లారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, శంభీపూర్ రాజు, టి.ఎస్.ఐ.ఐ.సి. చైర్మన్ బాలమల్లు తదితరులు ప్లీనరీకి వచ్చే తెరాస కార్యకర్తలకు అవసరమైన ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించే బాధ్యత తీసుకొన్నారు. 

ఎమ్మెల్సీలు మైనంపల్లి హనుమంతరావు, కర్నె ప్రభాకర్ తదితరులు ప్లీనరీ ప్రాంగణం ఏర్పాట్లు చూసుకొన్నారు. ఇంకా అనేకమంది తెరాస ప్రముఖులు ప్లీనరీ ఏర్పాట్లలో పాల్గొన్నారు. ఈ ప్లీనరీ ఏర్పాట్లకు ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు తెర వెనుక ఉండి అవసరమైన సహాయసహకారాలు అందిస్తారనేది బహిరంగ రహస్యమే.  

ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా ప్రభుత్వంలో మంత్రులు, తెరాస ప్రజా ప్రతినిధులు అందరూ ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు కనుక 2-3 రోజులుగా పోలీసులు అందరూ అక్కడే మొహరించి పటిష్టమైన భద్రత మరియు ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. డాగ్ స్క్వాడ్స్, బాంబు డిస్పోసల్ స్క్వాడ్స్, నిఘా అధికారుల హడావుడి షరా మామూలే. పాసులున్న వారిని తప్ప ఎవరినీ లోపలకి అనుమతించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కొంపల్లి పూర్తిగా గులాబీ రంగు సంతరించుకొంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే రాష్ట్రం నలుమూల నుంచి తెరాస కార్యకర్తలు కొంపల్లికి చేరుకొంటున్నారు. మరి కొద్ది సేపటిలో ప్లీనరీ సమావేశం మొదలవుతుంది.