నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి ఉమ్మడి జిల్లా పరిషత్ సమావేశం బుదవారం జరిగింది. దానిలో మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోమటిరెడ్డి లేవనెత్తిన సమస్యలపై వాగ్వాదం జరిగి ఉంటే, ఆ సమస్య ఎందుకు పరిష్కరింపబడలేదో కారణాలు తెలిసి ఉండేవి. కానీ ఇద్దరూ అసలు సమస్య గాలికి వదిలేసి వ్యక్తిగత స్థాయిలో ఒకరినొకరు దూషించుకోవడంనే సమావేశం పూర్తయింది.
జిల్లలో కనగల్ మండలంలో త్రాగునీటి రిజర్వాయర్ లో మోటార్లు కాలిపోవడం వలన ప్రజలకు నీళ్ళు అందాకా చలా ఇబ్బందులు పడుతున్నారని, కనుక కొత్త మోటార్లను ఏర్పాటు చేసి నీళ్ళు అందించాలని తాను ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. "మంత్రికి ఇష్టం లేనందునే మోటార్లు మార్చడం లేదా లేక కాంగ్రెస్ కు చెందిన కోమటిరెడ్డి అడుగుతున్నాడు కాబట్టి మార్చకూడదనుకొన్నారా?" అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించడంతో మంత్రి జగదీశ్ రెడ్డి సహనం కోల్పోయి ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఇద్దరూ తీవ్ర పదజాలంతో ఒకరినొకరు దూషించుకొన్నారు.
జెడ్.పి సభ్యులు వారిని అతికష్టం మీద శాంతపరిచక నాగార్జున సాగర్ ఏరియా ఆసుపత్రి కమిటీలో స్థానిక సభ్యులను కాదని దూర ప్రాంతాలలో జెడ్.పి.టి.సి.లను ఎందుకు తీసుకొంటున్నారని కోమటిరెడ్డి మంత్రిని గట్టిగా నిలదీశారు. అంతే..మళ్ళీ వారిరువురు మద్య వాగ్వాదం మొదలైపోయింది. చివరకు ఆ సమస్యలకు ఎటువంటి పరిష్కారం తేల్చకుండానే సమావేశం ముగిసింది.