ఏపిలో 200 సీట్లు తెదేపాకేనట!

తెదేపా ప్రభుత్వం అంటే సీరియస్ యాక్షన్ సినిమా వంటిది. దానిలో కామెడీకు పెద్దగా అవకాశం ఉండేది కాదు. అప్పుడప్పుడు నిఖార్సుగా మాట్లాడే జేసి దివాకర్ రెడ్డి, రకరకాల వేషాలు వేసే ఎంపి శివప్రసాద్ మాత్రమే కొంచెం కామెడీ పంచిపెట్టేవారు. ఇప్పుడు రాష్ట్ర ఐటి శాఖా మంత్రిగా తెదేపా సర్కార్ లోకి ఎంట్రీ ఇచ్చిన నారా లోకేష్ ఆ లోటును కొంతవరకు భర్తీ చేస్తున్నారు. మొన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా ‘వర్ధంతి శుభాకాంక్షలు’ చెప్పి నవ్వులు పూయించారు.

ఆ తరువాత మొన్న తూర్పు గోదావరి జిల్లాలో ‘నీటి సమస్యను ఏర్పాటు చేయడమే తన లక్ష్యం’ అని ప్రకటించేసి జనాలకు వినోదింపజేశారు. ఆయన నీటి సమస్యను సృష్టిస్తానన్న జనాలు నవ్వుకొన్నారంటే అంతకంటే గొప్ప కామెడీ ఏముంటుంది?

తాజాగా అనంతపురం జిల్లా పర్యటనలో తెలుగు తమ్ముళ్ళను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “వచ్చే ఎన్నికలలో 200 స్థానాలలో తెదేపాను గెలిపించుకొనేందుకు కార్యకర్తలు అందరూ గట్టిగా కృషి చేయాలని” పిలుపునిచ్చి వినోదింపజేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవి 175 సీట్లు మాత్రమే. అంటే రాష్ట్రంలో ఎన్ని శాసనసభ స్థానాలు ఉన్నాయో కూడా తెలియకుండానే మంత్రి అయిపోయారా? అని జనాలు ఒకటే గుసగుసలు. తెదేపా లేదా మరో పార్టీ ఏదైనా సరే 175 సీట్లకి పోటీ చేసినా అన్ని సీట్లను ఏ పార్టీ కూడా గెలుచుకోలేదు. కొన్ని ఇతర పార్టీలకు వెళ్ళిపోతాయి. మరి అటువంటప్పుడు 175కి 200 సీట్లు గెలుచుకోవడం అంటే మాటలా? ఇంకా రెండేళ్ళు ఈ జబర్దస్త్ కామెడీ షో విజయవంతంగా సాగుతుంది. కనుక అందరికీ సంతోషమే.