వేసవి వస్తే హైదరాబాద్ నగరవాసులు మంచి నీళ్ళలు ఇబ్బంది పడటం సర్వసాధారణమైన విషయంగా ఉండేది. తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం కోసం నడుం బిగించింది. ఆ ప్రయత్నంలో భాగంగానే నగరంలో నలువైపులా రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టింది. మొత్తం 12 రిజర్వాయర్లలో 4 నిర్మాణం పూర్తి చేసుకొని వినియోగానికి సిద్దమయ్యాయి. అవి నల్లగండ్ల, హుడా మియాపూర్, గోపన్ పల్లి, కె.పి.హెచ్.బి-4 రిజర్వాయర్లు.
రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి కేటిఆర్ ఈరోజు వాటికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, “నగరంలో ప్రతీ మనిషికి రోజుకి 150 లీటర్ల నీటిని అందజేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఈ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాము. నిజానికి ఇవి వచ్చే ఏడాది జూన్ నెలలో పూర్తి కావలసి ఉంది. కానీ అందరూ కలిసికట్టుగా పనిచేసి ఏడాది ముందుగానే పూర్తి చేశాము. ఇందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. ఆగస్ట్-సెప్టెంబర్ నాటికి మిగిలినవి కూడా పూర్తి చేస్తాము. వచ్చే రెండేళ్ళలో మరో 46 రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేస్తాము. శామీర్ పేటలోని కేశవపూర్ వద్ద 20 టి.ఎం.సి.ల సామర్ధ్యం కలిగిన భారీ రిజర్వాయర్ నిర్మిస్తున్నాము. ఔటర్ రింగ్ రోడ్డు లోపల, బయట ఉన్న అన్ని ప్రాంతాలకు త్వరలోనే కావలసినన్ని నీళ్ళు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. మిషన్ భగీరథ పధకం క్రింద రూ.1,900 కోట్లతో మొత్తం 1,800 కి.మీ పైపులైన్లను నిర్మిస్తున్నాం. ఇంకా హైదరాబాద్ లో రోడ్లు అభివృద్ధిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాము. మేము చేపట్టిన ఈ అభివృద్ధి పనులన్నీ పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి. నగరంలో ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి,” అని అన్నారు.