ఎర్రబుగ్గలు వద్దు..

ఈ రోజు జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో మోడీ సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకొంది. ఇక నుంచి దేశంలో రాష్ట్రపతితో సహా ఎవరి వాహనాలపై ఎర్ర బుగ్గ ఉండరాదని, అవి కేవలం పోలీస్ మరియు అత్యవసర సేవలు అందించే అంబులెన్స్ లకు మాత్రమే వినియోగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం మే 1వ తేదీ నుంచే దేశవ్యాప్తంగా అమలుచేయాలని ఉత్తర్వులు జారీ చేయబోతోంది. 

ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తమ మంత్రులు ఎవరూ తమ వాహనాలపై ఎర్ర బుగ్గ వాడరాదని ఆదేశించారు. వి.ఐ.పి.కల్చర్ మరీ మితిమీరిపోవడంతో ప్రభుత్వాలే కాకుండా సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడవలసివస్తోంది. కనుక దానికి ప్రధాని నరేంద్ర మోడీ కత్తెర వేయడం చాలా మంచి నిర్ణయమే. 

అయితే నేటికీ మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ వాహనానికి ముందు, వెనుకా కాన్వాయ్ పేరిట కనీసం ఒకటి రెండు డజన్లు వాహనాలు లేకపోతే నామోషీగా భావిస్తుంటారు. కేంద్రం తీసుకొన్న ఈ తాజా నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దుసంప్రదాయానికి, దాని కోసం ప్రజా ధనం దుబారాను అరికట్టాలి.