ఈ గులాబీ కూలి ఏమిటో..లక్షలు రాలడం ఏమిటో..

ఈనెల 27న వరంగల్ లో జరుగబోయే తెరాస బహిరంగ సభ కోసం తెరాస ప్రజాప్రతినిధులు, నేతలు అందరూ ‘గులాబీ కూలి’ చేసి నిధుల సమీకరిస్తున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్ తెరాస ఎంపి కవిత నిన్న పట్టణంలోని ఎల్.వి.ఆర్. క్లాత్ షో రూమ్ లో చీరలు అమ్మడం ద్వారా గులాబీ కూలి చేసి రూ.7 లక్షలు గులాబీ కూలి సంపాదించుకొన్నారు. ఆమె వచ్చిన సంగతి తెలుసుకొని చాలా మంది తెరాస కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. షాపులో చీరలు కొనడానికి వచ్చిన మహిళలకు కవిత స్వయంగా చీరలు చూపించి అమ్మకాలు చేశారు. 

మంత్రి హరీష్ రావు హన్మకొండలో చీరలు, బంగారు ఆభరణాలు, ఛాయ్ దుఖాణాలలో పనిచేసి రూ.8.51 లక్షలు గులాబీ కూలి సంపాదించుకొన్నారు. స్థానిక శ్రీ లక్ష్మి నర్శింగ్ హోం (ఆసుపత్రి) లో గచ్చులు తుడిచినందుకు ఆ ఆసుపత్రి యాజమాన్యం రూ.5లక్షలు, ఆసుపత్రి సిబ్బంది రూ.5,116 హరీష్ రావుకు అందజేశారు. ఇంకా చాల మంది తెరాస నేతలు ఈవిధంగా గులాబీ కూలి చేసి నిధులు సమకూర్చుకొన్నారు. 

తెరాస బహిరంగ సభ పెట్టుకొని దానిలో 26 రకాల వంటకాలు చేసుకోదలిస్తే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు కానీ దాని కోసం ఇతరులను డబ్బు చెల్లించమని అడగడం సరికాదు. తెరాసలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు పార్టీ సభను నిర్వహించడానికి విరాళాలు ఇవ్వలేనంత దయనీయమైన స్థితిలో లేరు కదా! పైగా ప్రతీ ఏటా ప్రభుత్వోద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు వాళ్ళకి పెంచుకొంటూనే ఉన్నారు కదా? మరి వారి సభకు ఇతరులను డబ్బు చెల్లించమని ఎందుకు అడుగుతున్నారు? తమ పార్టీ బహిరంగ సభ నిర్వహించుకోవడానికి గులాబీ కూలి పేరిట వ్యాపారస్తులు, హాస్పిటల్స్, ఇతర ప్రైవేట్ సంస్థల నుంచి విరాళాలు వసూలు చేయడం గురించి తెరాస అనుకూల మీడియా గొప్పగా పొగడవచ్చేమో కానీ అధికారంలో ఉన్నవారు ఇటువంటి పనులు చేస్తే అవి సామాన్య ప్రజలలో వారి పట్ల వ్యతిరేకత కలిగిస్తాయని గ్రహిస్తే మంచిది.