“సమయం లేదు మిత్రమా..శరణమా..రణమా తేల్చుకో” అనే శాతకర్ణి డైలాగులను ఏపి సిఎం చంద్రబాబు కూడా ఇటీవల శాసనసభలో జగన్ ను ఉద్దేశ్యించి పలికారు. అది వేరే కధ! ఇప్పుడు మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ కూడా మంత్రి హరీష్ రావును ఉద్దేశ్యించి ఆ డైలాగులని పలికారు.
ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ ను నగర శివార్లకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు మొన్న ట్యాంక్ బండ్ వద్ద ధర్నా చేసినప్పుడు, పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆ సందర్భంగా సర్వే సత్యనారాయణ మంత్రి హరీష్ రావును ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. కనుక మీకు అట్టే సమయం లేదు మిత్రమా..అప్రజాస్వామిక పాలన చేస్తున్న కేసీఆర్ పై ప్రజలు విసుగెత్తిపోయున్నారు. ఇప్పుడు తన స్థానంలో కొడుకును కూర్చోబెట్టడానికి సిద్దం అవుతున్నారు. కనుక మీరు ఆయనపై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోండి. మీకు మా పార్టీ అండగా ఉంటుంది,” అని అన్నారు.
కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిస్తే, కాంగ్రెస్ నేతలు తెరాసలో అసంతృప్తి నెలకొని ఉందని గట్టిగా వాదిస్తూ, హరీష్ రావు వంటి నేతలను రెచ్చగొట్టి తెరాసను మానసికంగా దెబ్బ తీసి బలహీనపరచాలని ప్రయత్నిస్తునట్లుంది. అయితే కాంగ్రెస్ నేతలకు ఈ అవకాశం కల్పించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అనే చెప్పకతప్పదు. కేటిఆర్ ను ముఖ్యమంత్రి చేయబోతున్నారనే చర్చ మొదట ఆ పార్టీలోనే పుట్టింది. దానిని ప్రతిపక్షాలు ఈవిధంగా వాడుకొంటున్నాయి అంతే!