కేటిఆర్ అలాగ ఎందుకన్నారో?

తెరాస సర్కార్ లో ఎటువంటి ఆధిపత్యపోరు జరుగడం లేదని, హరీష్ రావుతో తనకు ఎటువంటి భేదాభిప్రాయలు లేవని చెప్పడానికి మంత్రి కేటిఆర్ ఇచ్చిన వివరణతో ఆ అనుమానాలు నివృతి కాకపోగా మరిన్ని సందేహాలు కలిగించింది. కేటిఆర్ మొన్న మీడియాతో మాట్లాడుతూ, “నాకు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే కోరిక లేదు. మరో పదేళ్ళవరకు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారు. హరీష్ రావుతో నాకు ఎటువంటి విభేదాలు లేవు. ఆయన కాంగ్రెస్ పార్టీ చేరరు,” అని చెప్పారు. 

కేటిఆర్ ముక్తాయింపుగా అన్న ఆ చివరిమాట మళ్ళీ కొత్త అనుమానాలకు తావిచ్చేదిగా ఉంది. హరీష్ రావు అసంతృప్తిగా ఉన్నారా? అందుకే అయన కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకొంటున్నారా? లేకుంటే కేటిఆర్ ఆ మాట అనవలసిన అవసరం ఏమిటి? అనే సందేహం కలగడం సహజం. 

ఒక విలేఖరి సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిని, “ఒకవేళ హరీష్ రావు మీ పార్టీలో చేరాలనుకొంటే చేర్చుకొంటారా?” అని ప్రశ్నించినప్పుడు, దానికి సమాధానంగా అయన “అసలు కేటిఆర్ కి ఆ అనుమానం ఎందుకు వచ్చింది? హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరరని ఎందుకు చెప్పవలసివచ్చింది? అంటే హరీష్ రావుపై ఆయనకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏవో అనుమానాలు ఉన్నాయని స్పష్టం అవుతోంది. ఆయన మా పార్టీలో చేరుతారా లేదా అని మీరు మమ్మల్ని అడిగే బదులు నేరుగా ఆయనని, కేసీఆర్, కేటిఆర్ లను అడిగితే బాగుంటుంది కదా!” అని చెప్పారు. నిజమే కదా! నిప్పు లేన్నప్పుడు పొగ ఎందుకు?