త్వరలో జనసేన రిక్రూట్ మెంట్ డ్రైవ్!

ఈనెల 21 నుంచి జనసేన పార్టీలో రిక్రూట్ మెంట్ డ్రైవ్ జరుగబోతోంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. అనంతపురం జిల్లా నుంచే పార్టీని స్థాపించాలని పవన్ కళ్యాణ్ భావిస్తునందున, ముందుగా ఆ ప్రాంతానికి చెందిన రాజకీయ విశ్లేషకులు, జిల్లా సమస్యలపై మంచి అవగాహన కలిగి చక్కగా ప్రసంగం చేయగల వక్తలను ఎంపిక చేసుకోబోతున్నారు. వాటి కోసం ఇదివరకు ఇచ్చిన ఒక ప్రకటనకు 3600 దరఖాస్తులు వచ్చాయని, వారందరికీ వరుసగా 3 రోజుల పాటు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అభ్యర్ధుల ఎంపిక చాలా పారదర్శకంగా జరుగుతుందని, కేవలం పార్టీ ఆశయాల పట్ల నమ్మకం ఉన్నవారు, ప్రతిభగలవారికే అవకాశం కల్పిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేనను అప్రదిష్టపాలు చేయాలనుకొనే వారిని ఈ పవిత్ర యజ్ఞంలో చొరబడకుండా అభిమానులు జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు.