రాష్ట్రంలో ఎన్నికలు వచ్చేస్తున్నాయా?

తెరాస, కాంగ్రెస్ పార్టీల హడావుడి చూస్తుంటే అప్పుడే ఎన్నికలు వచ్చేశాయా? అనే అనుమానం కలుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు సమయం ఉన్నప్పటికీ రెండు పార్టీలు అప్పుడే పోటాపోటీగా ప్రజలకు ఎన్నికల వాగ్దానాలు గుప్పించడం మొదలుపెట్టేయడం విశేషం. 

ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్స్ పెంచుతూ తెరాస సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లు, వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో రైతులు అందరికీ ఉచితంగా ఎరువులు అందిస్తామని కేసీఆర్ ప్రకటించడం ఆవిధంగానే చూడవలసి ఉంటుంది. 

వచ్చే ఎన్నికల కోసం తాము రూపొందించుకొన్న పధకాలు బయటకు పొక్కి తెరాస చేతికి చేరుతున్నాయనే భయంతో  కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల వాగ్దానాలు ప్రకటించడం మొదలుపెట్టింది. పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో మా పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. మా పార్టీ అధికారంలోకి రాగానే రైతుల పంట రుణాలు వాయిదాల పద్దతిలో కాకుండా అన్నీ ఒకేసారి రద్దు చేస్తాం. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భ్రుతి కూడా ఇస్తాము. అది ఎంతనేది త్వరలో ప్రకటిస్తాము,” అని చెప్పారు. 

భాజపా, తెదేపా, వామపక్షాలు ఇంకా రంగంలోకి దిగలేదు. కాంగ్రెస్, తెరాసల జోరు చూసి అవి కూడా నేడో రేపో ఎన్నికల హామీలతో ప్రజల ముందుకు రావచ్చు. కానీ అన్ని పార్టీలు ఎంత ఆత్రపడినా ఎన్నికలు మాత్రం రెండేళ్ళ తరువాతే వస్తాయి.