ఆ బిల్లుపై ఎవరెమన్నారంటే...

రిజర్వేషన్ బిల్లుపై ఆదివారం శాసనసభలో జరిగిన చర్చలో మంత్రి తలసాని మాట్లాడుతూ దేశంలో ఎవరు మతరాజకీయాలు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించకుండా భాజపా అడ్డుపడితే, వచ్చే ఎన్నికల తరువాత భాజపా శాసనసభలోకి అడుగుపెట్టలేదని హెచ్చరించారు. దీని నుంచి రాజకీయ మైలేజి పొందేందుకే భాజపా రాద్దాంతం చేస్తోందని తలసాని అన్నారు. 

తెరాస మంత్రులు, నేతలు సహజంగానే ఈ బిల్లు చారిత్రాత్మకమైనదని భుజాలు చరుచుకొన్నారు. 

అయితే ప్రతిపక్షాల వాదనలు మరో రకంగా ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని, ఒకవేళ ఇవ్వడానికి ప్రయత్నించినా న్యాయస్థానాలు అంగీకరించవాణి ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసి ఉన్నప్పటికీ, ఆయన ముస్లింలను కూడా మభ్యపెట్టి వారి ఓటు బ్యాంక్ ను ఆకర్షించేందుకే ఈ ప్రతిపాదన చేశారని కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ వాదన. 

రాష్ట్రంలో ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు పెంచడాన్ని ఎం.ఆర్.పి.ఎస్. అధినేత మందకృష్ణ మాదిగ తప్పుపట్టారు. కేసీఆర్ ఆ రెండు వర్గాల ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ బిల్లును తీసుకువచ్చారని విమర్శించారు. 

కేసీఆర్ ప్రతిపాదనకు తెదేపా ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి మాత్రమే బేషరతుగా మద్దతు ఇచ్చారు.