కేసీఆర్ కు ఆంధ్రా నేత అభినందనలు

తెలంగాణాలో వెనుకబడిన ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముద్రగడ పద్మనాభం అభినందిస్తూ ఒక లేఖ వ్రాశారు. ఎన్నికల మ్యానిఫెస్టో చిత్తు కాగితాలు కావని చెప్పడమే కాకుండా అందులో పేర్కొన్న ప్రతీ హామీని అమలుచేసి చూపిస్తున్నందుకు కేసీఆర్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నాని ముద్రగడ తన లేఖలో వ్రాశారు. పదవులు, అధికారం, ఆస్తుల కంటే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ముఖ్యమని, అటువంటివాడే అసలైన రాజకీయ నేత అని, మీరు (కేసీఆర్) అటువంటి గొప్ప నేత అని ముద్రగడ ప్రశంసించారు. మున్ముందు మరిన్ని మంచిపనులు చేసి కేసీఆర్ మరింత మంచి పేరు సంపాదించుకోవాలని ఆశిస్తున్నానని ముద్రగడ పద్మనాభం తన లేఖ ద్వారా అభిలాషించారు.

ఈ బిల్లును ఆమోదించినందుకు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కేసీఆర్ ను విమర్శిస్తుంటే, ఆంధ్రాకు చెందిన ముద్రగడ కేసిఆర్ను ప్రశంసిస్తూ లేఖ వ్రాయడం విశేషం. చంద్రబాబు నాయుడుబాబుని విమర్శించేందుకు ఏ అవకాశం వచ్చినా ఆయన వదులుకోరు కనుకనే బాబు చేయలేని పని కేసీఆర్ చేసి చూపించారని చెప్పేందుకే లేఖ వ్రాశారని చెప్పవచ్చు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు దాని కోసం శాసనసభలో బిల్లు పెట్టలేదు. అందుకే ఆయన తరచూ చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ లేఖలు వ్రాస్తుంటారు. ఇప్పుడు ఈవిధంగా మరోసారి బాబుకి ముద్రగడ చురకలు వేశారనుకోవచ్చు.