తెరాస అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ ఆరంభం అయిన సంగతి తెలిసిందే. ఆ పదవికి తెరాసలో ఎవరూ నామినేషన్ వేసే సాహసం చేయలేరు కనుక కేసీఆర్ తరపున తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు ఏకంగా 9 సెట్ల నామినేషన్లను ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న నాయిని నరసింహారెడ్డికి ఆదివారం సమర్పించారు.
కేసీఆర్ తరపున నామినేషన్ సెట్స్ దాఖలు చేసినవారిలో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వర రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, చందూలాల్ ఉన్నారు. తెరాస ఎంపిలు కవిత, జితేందర్ రెడ్డి, వినోద్, కే.కేశవ్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పసునూరి దయాకర్ తదితరులున్నారు. ఇంకా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పెద్ద జాబితాయే ఉంది.
సాధారణంగా ఏ పార్టీలోనైనా అధ్యక్ష పదవి ఏకగ్రీవంగానే జరుగుతుంటుంది కనుక దాని కోసం రెండు లేదా మూడు సెట్లు నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తుంటారు. కానీ తెరాసలో దాని కోసం కూడా నేతలు, ప్రజా ప్రతినిధులు పోటీలు పడటం విశేషం. మున్ముందు పార్టీలో నేతలు అందరూ కేసీఆర్ తరపున ఒక్కో సెట్ దాఖలు చేసినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. అయినా ఆ పదవికి పార్టీలో వేరే ఎవరూ పోటీ చేసే సాహసం కూడా చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు కేసీఆర్ తరపున ఎన్ని సెట్లు నామినేషన్లు వేసినా ఒక్కటే కదా? ఎన్ని ఎక్కువ సెట్లు దాఖలు చేస్తే అంత గొప్ప..అదే ప్రజాస్వామ్యం అన్నట్లుంది తెరాస తీరు. కానీ ఇదేనా ప్రజాస్వామ్య విధానం అంటే?