అందరికీ వర్ధంతి శుభాకాంక్షలు: లోకేష్

ఏపి సిఎం చంద్రబాబు కొడుకు నారా లోకేష్ తెలుగులో గట్టిగా నాలుగు ముక్కలు మాట్లాడితే వాటిలో ఖచ్చితంగా ఒక్క తప్పు అయినా ఉంటుందని చెప్పవచ్చు. అంతేకాదు..ఏదో చెప్పబోయే మరేదో అనేస్తుంటారు. ఇదివరకు ఒకసారి ఏపిలో ఒక రోడ్ షోలో వైకాపాను విమర్శించాలనుకొని, “తెదేపా అంత అవినీతి, కులపిచ్చి ఉన్న పార్టీ మరొకటి లేదు,” అంటూ నోరు జారారు. జనం విరగబడినవ్వడంతో సర్దుకొని “వైకాపా అంత” అని సవరణ ఇచ్చుకొన్నారు. 

మళ్ళీ ఈ మద్యన మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు ‘సార్వభౌమాధికారం’ అనే పదాన్ని పలుకలేక నవ్వులపాలయ్యారు. నిన్న మరో ముచ్చట జరిగింది. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ “అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు” అని నోరు జారరు. అది విని అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకొన్నారు. పక్కనున్నవారు ఎవరో చెపితే “సారీ జయంతి శుభాకాంక్షలు” అని లోకేష్ సర్దుకొని తన ప్రసంగం కొనసాగించారు. 

జయంతి అంటే పుట్టినదినం సందర్భంగా ఏటా జరుపుకొనే వేడుక అని, వర్ధంతి చనిపోయిన రోజున ఏటా చేసుకొనే సంస్మరణ దినం అనే సంగతి నారా లోకేష్ కు తెలియదని దీని వలన స్పష్టం అయ్యింది. అందుకే అంబేద్కర్ చనిపోయిన రోజున శుభాకాంక్షలు చెప్పగలిగారు. మున్ముందు ఆయన నోటి నుంచి ఇంకా ఇటువంటి ఎన్ని గొప్ప మాటలు వినిపిస్తాయో చూడాలి. కొన్ని రోజుల క్రితమే చంద్రబాబు కూడా శాసనసభలో “అభివృద్ధిలోనైనా అవినీతిలోనైనా దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్: 1 స్థానం లో ఉంది,” అని నోరు జారారు. తరువాత “అవినీతిని అరికట్టడంలో నెంబర్: 1 స్థానంలో ఉంది” అనే సవరణ ఇచ్చుకోవలసి వచ్చింది.