భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చే నెలాఖరులో తెలంగాణా రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటించబోతున్నారు. ఈరోజు నుంచి ఓడిశాలో మొదలయ్యే భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆయన హాజరవుతారు. ఆ సమావేశాలకు వెళుతున్న తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ఆయన పర్యటనను ఖరారు చేసుకొని వస్తారని సమాచారం.
వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో కనీసం 6 లోక్ సభ సీట్లు గెలుచుకోవాలని అమిత్ షా సరికొత్త వ్యూహం, లక్ష్యం నిర్దేశించడంతో రాష్ట్ర భాజపా నేతలు అందుకు అనుగుణంగానే తమ కార్యాచరణను రూపొందించుకొంటున్నారు. మూడు రోజుల క్రితమే ఇద్దరు కేంద్రమంత్రులు ఇదేపని మీద తెలంగాణాలో సమావేశాలు నిర్వహించారు. అమిత్ షా కూడా ముందుగా హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో, ఆ తరువాత ఎంపిక చేసిన నియోజకవర్గాలలో పర్యటించి బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశమవుతారని తెలుస్తోంది. 2019 ఎన్నికలను ఎదుర్కోవడానికి పార్టీకి తగిన కార్యాచరణ, మార్గదర్శనం చేయవచ్చు.
తెలంగాణాపై మళ్ళీ పట్టు సంపాదించుకొని తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భాజపా పట్టుదలగానే ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఒకవేళ భాజపా పట్టుదలతో గట్టిగా కృషి చేస్తే, రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయినా, అదనంగా మరికొన్ని శాసనసభ స్థానాలను, కొత్తగా లోక్ సభ స్థానాలను గెలుచుకొనే అవకాశం ఉంటుంది. అయితే కేంద్రమంత్రులు, అమిత్ షా వంటి జాతీయ నేతలు తరచూ రాష్ట్రంలో పర్యటిస్తూ, పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తుండవలసి ఉంటుంది. అదేవిధంగా భాజపాలో ద్వితియశ్రేణి నేతలలో ప్రతిభ గలవారిని గుర్తించి వారికి ఎదిగేందుకు అవకాశాలు కల్పించవలసి ఉంటుంది. అప్పుడే భాజపా కలలు సాకారం అయ్యే అవకాశం ఉంటుంది.