ఈనెల 27న వరంగల్ లో జరుగబోయే తెరాస ఆవిర్భావదినోత్సవ సభకు నిధులు సమకూర్చడానికి తెరాస మంత్రులు, నేతలు ‘గులాబీ కూలి’ పేరిట రకరకాల పనులు చేస్తున్నారు. రాష్ట్ర ఐటి మంత్రి కేటిఆర్ కొంపల్లిలోని ఒక ఐస్ క్రీమ్ షాపులో ఐస్ క్రీమ్ లు అమ్మి రూ.6 లక్షలు సంపాదించారు. శ్రీనివాస్ రెడ్డి అనే ఒక స్థానిక నేత లక్ష రూపాయలకు, ఎంపి మల్లారెడ్డి రూ.5లక్షలకు ఐస్ క్రీమ్స్ కొనుకొన్నారు. ఆ తరువాత కేటిఆర్ కుత్బుల్లాపూర్ లో ఒక జ్యూస్ సెంటర్ లో ఐస్ క్రీమ్, జ్యూస్ అమ్మారు. పక్కనే ఉన్న ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో 25నిమిషాల సేపు సివిల్ ఇంజనీర్ గా పనులను పర్యవేక్షించినందుకు రూ.7.30 లక్షలు గులాబీ కూలి ముట్టింది. అనంతరం మంత్రి కేటిఆర్ తన వెన్నంటి వచ్చిన తెరాస ఎమ్మెల్యేలను, నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ ప్లీనరీ మరియు బహిరంగ సభకు హాజరయ్యేందుకు ఎవరి ఖర్చులు వారే పెట్టుకోవాలని దాని కోసం అందరూ గులాబీ కూలి చేసి తగినంత డబ్బు సంపాదించుకోవాలని కోరారు. ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చిన్న పెద్దా తెరాస నేతలు కూడా గులాబీ కూలి చేయబోతున్నారు కనుక ఇటువంటి విడ్డూరాలు చాలానే చూసే భాగ్యం ప్రజలకు కలుగుతుంది.