నేడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపి రాజధాని అమరావతిలో 125 అడుగుల ఎత్తు గల అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంఖుస్థాపన చేశారు. అయినవోలు- శాఖమూరు గ్రామాల మద్య 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాని చుట్టూ అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుపై ఏపి సర్కార్ రూ.97.64 కోట్లు ఖర్చు చేయబోతోంది.
ఈ శంఖుస్థాపన కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి 25మంది బౌద్ద భిక్షువులు హాజరయ్యారు. మధ్యప్రదేశ్ లోని అంబేద్కర్ జన్మస్థలం మౌ గ్రామం నుంచి, పార్లమెంటు ప్రాంగణం నుంచి, ఏపిలోని కొన్ని ప్రాంతాల నుంచి మట్టిని సేకరించి తెచ్చారు. స్మృతివనంలో ఒక యోగా కేంద్రం, గ్రంధాలయం, కన్వెన్షన్ సెంటర్, ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మించబోతున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, తెదేపా ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు.
తెరాస సర్కార్ కూడా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో125 అడుగుల ఎత్తు గల అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించబోతోంది. ఆ విగ్రహాన్ని చైనాలో తయారు చేయించి తీసుకువస్తోంది. అలాగే యాద్రాద్రిలో 108అడుగుల ఎత్తు గల హనుమంతుడి విగ్రహం కూడా చైనాలో తయారుచేయిస్తోంది.