శభాష్ తెరాస ఎంపిలు: పవన్ కళ్యాణ్

జనసేనాని పవన్ కళ్యాణ్ తెరాస, వైకాపా ఎంపిలపై ప్రశంశలు, తెదేపా ఎంపిలపై విమర్శలు గుప్పించారు. ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని తెరాస ఎంపి రాపోలు ఆనంద భాస్కర్‌ మొన్న పార్లమెంటులో కేంద్రాన్ని గట్టిగా నిలదీశారు. వైకాపా సభ్యులు ఆయనకు మద్దతు పలికారు. అందుకు పవన్ కళ్యాణ్ వారందరికి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపి అభినందించారు. 

ఈ అంశంపై సభలో చర్చ జరుగుతున్నప్పుడు తెదేపా ఎంపిలు సభకు డుమ్మా కొట్టడం, సభలోనే ఉన్న కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు మౌనంగా చూస్తూ కూర్చోన్నందుకు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా ఎంపిలు ఎప్పుడూ తమ స్వంత ప్రయోజనాలే చూసుకొంటున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తమ స్వార్ధ ప్రయోజనాల కోసం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెడుతున్నారని పవన్ విమర్శించారు. ప్రత్యేక హోదా ఇస్తుందనే ఆశతోనే ఏపి ప్రజలు తెదేపా, భాజపాలకు ఓట్లు వేశారని కానీ అవి మాట తప్పాయని పవన్ అన్నారు. ఈ విషయంలో కేంద్రంతో రాజీపడి తెదేపా తప్పు చేసిందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

మూడేళ్ళ క్రితం యూపియే హయంలో జరిగిన రాష్ట్ర విభజనపై పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేంద్రం వైఖరిని తప్పు పట్టడం విచిత్రమనుకొంటే, మళ్ళీ దానిని ఉత్తారాది, దక్షిణాది రాష్ట్రాల వివాదంతో ముడిపెట్టడం ఇంకా విచిత్రంగా ఉంది. ఉత్తరప్రదేశ్ లో ప్రత్యేక రాష్ట్రాల కోసం చాలా కాలంగా డిమాండ్స్ ఉన్నాయని, కేంద్రప్రభుత్వం యూపిని విభజించే సాహాసం చేయాలదా? లేకపోతే దాని విభజన సూత్రాలన్నీ దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే పరిమితమా? అని ప్రశ్నించారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం అవలంభించడం వివక్ష కాదా? అని కాదా ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ఇటువంటి విధానాల వలననే ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మద్య విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.