అయ్యో..తెరాసను ఎంత మాటనేశారో!

చింత చచ్చినా పులుపు చావదన్నట్లు, తెలంగాణాలో తెదేపా చాలా బలహీనపడినప్పటికీ అధికార తెరాసకు తమ పార్టీ ఏమాత్రం తీసిపోదన్నట్లు మాట్లాడుతుంటారు ఆ పార్టీ నేతలు. అంతటితో ఆగకుండా తమ ముందు తెరాస బలాదూర్ అన్నట్లు మాట్లాడటం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

తెలంగాణా తెదేపాలో సంస్థాగత ఎన్నికల నిర్వహణ అధికారులకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరుగుతున్న శిక్షణా కార్యక్రమాలలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ఏమన్నారంటే, “కేసీఆర్ తెదేపాలో ఉన్నప్పుడు మంత్రి పదవి ఇవ్వలేదనే దుగ్ధతోనే బయటకు పోయి తెరాస పెట్టుకొన్నారు. తెరాస ఒక గాలివాటం పార్టీ. తెరాసకు సంస్థాగత నిర్మాణం, వ్యవస్థ, బలం లేవు. తెలంగాణా సెంటిమెంటును అడ్డుపెట్టుకొని ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉద్యమాలు చేయడంలో మంచి అనుభవం ఉందేమో కానీ ఆయనకు పరిపాలన చేతకాదు. మూడేళ్ళు గడిచినా ఇంతవరకు ఆయన పాలనపై పట్టు సాధించలేకపోయారు. అందుకే ప్రజలకు మాయమాటలు చెపుతూ కాలక్షేపం చేసేస్తున్నారు,” అని అన్నారు. 

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “మిగులు బడ్జెట్ చేతికి అందిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చేశారు. రూ.60,000 కోట్లు ఉన్న అప్పులను కేసీఆర్ మూడేళ్ళలోనే ఏకంగా రూ.1.40 లక్షల కోట్లకు చేర్చారు. అంత అప్పు చేసినా ఇంతవరకు రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఒక్క ఎన్నికల హామీని కూడా నిలబెట్టుకోలేదు. కనీసం విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా సకాలంలో చెల్లించలేకపోతున్నారు. హామీలను అమలుచేయకుండా మాయమాటలు చెపుతూ ప్రజలను మోసగిస్తున్న తెరాసకు తెదేపాను విమర్శించే నైతిక హక్కు లేదు. తెరాసలో చచ్చిన పాము వంటి హరీష్ రావు మా పార్టీని విమర్శించడం చూస్తే నవ్వొస్తుంది. తెదేపాను విమర్శించే స్థాయి, అనుభవం మంత్రి కేటిఆర్ కు లేవు. వచ్చే ఎన్నికలలో ప్రజలు తెరాసకు గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు,” అని అన్నారు.