ఇటీవల టీ-కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ లో సమావేశమైనప్పుడు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొని వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్దం కావాలని నిర్ణయించుకొన్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగా పార్టీలో ముఖ్యనేతలు అందరూ కలిసి వచ్చే నెల 2వ వారంలో బస్సు యాత్రకు బయలుదేరాలని నిర్ణయించుకొన్నారు. ఈ బస్సు యాత్రలో రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలను చుట్టిరావాలనుకొంతున్నారు. త్వదారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడమే కాకుండా ప్రజలకు చేరువవచ్చని భావిస్తున్నారు. ఈ యాత్రలో ఎక్కడికక్కడ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూ తెరాస సర్కార్ ను ఎండగట్టడం ప్రధాన అజెండా అని వేరేగా చెప్పనవసరం లేదు. తెరాస నేతల ధాటికి, పార్టీలో సీనియర్ నేతల ఫిరాయింపుల కారణంగా బలహీనపడిన పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొని, బూత్ స్థాయి కార్యకర్తలలో మళ్ళీ ఆత్మవిశ్వాసం, నూతనోత్సాహం నింపడం ఈ యాత్ర యొక్క మరో ముఖ్య ఉద్దేశ్యం. కాంగ్రెస్ అధిష్టానం నుంచి డానికి అనుమతి రాగానే వారి పర్యటన షెడ్యూల్ మరియు రోడ్ మ్యాప్ ప్రకటిస్తారు.
కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా పనిచేస్తే వారిని ఎదుర్కోవడం చాలా కష్టమే కానీ వారి అనైఖ్యతే అధికార తెరాసకు శ్రీరామరక్షగా నిలుస్తోందని చెప్పవచ్చు. మళ్ళీ కాంగ్రెస్ నేతలందరూ ఒకే త్రాటిపైకి వచ్చి తెరాస సర్కార్ తో యుద్దానికి సిద్దం అవుతున్నారు కనుక అది కూడా మేల్కొని అందుకు సిద్దం అవడం మంచిది.