వెంకయ్య పంచ్ డైలాగు భలే ఉంది

యూపి ఎన్నికలలో భాజపా చేతిలో ఘోరపరాజయం పొందిన కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు, ‘ఈవిఎంలను ట్యాంపరింగ్ చేయడం వలననే భాజపా అంత ఘన విజయం సాధించిందని, కనుక ఇకపై ఎన్నికలలో బ్యాలెట్ పేపర్లనే ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏ మీట నొక్కినా భాజపాకే ఓట్లు పడేవిధంగా ట్యాంపరింగ్ జరిగిందని వాదిస్తున్నాయి. దీనీపై ఎన్నికల కమీషన్ కు పిర్యాదు చేసినా అది కొట్టిపారేసింది. కనుక ప్రతిపక్షాల నేతలు రేపు రాష్ట్రపతిని కలిసి ఈవిఎంల ట్యాంపరింగ్ గురించి పిర్యాదు చేయబోతున్నారు. 

దీనిపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. “ఈవిఎంలపై ప్రజల నమ్మకముంది కానీ కాంగ్రెస్, వామపక్షాలపైనే వారు రోజురోజుకి నమ్మకం కోల్పోతున్నారు. ఈ సంగతి ఆ పార్టీలు గ్రహిస్తే మంచిది,” అని ట్వీట్ చేశారు. 

వెంకయ్య నాయుడు చురకలు వినసొంపుగానే ఉన్నాయి. కొంతవరకు అవి వాస్తవం కూడా. అయితే అదే సూత్రం భాజపా కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించామని భాజపా గొప్పగా చెప్పుకొంటున్నప్పటికీ, అది అధికారంలో ఉన్న పంజాబ్ లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. అది అధికారంలో ఉన్న గోవాలో భాజపా కంటే కాంగ్రెస్ కే ఎక్కువ సీట్లు వచ్చాయి. మణిపూర్ లో కూడా అదే పరిస్థితి. యూపి, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో మాత్రం భాజపా నిజమైన విజయం సాదించింది.