రాష్ట్రంలో మొట్టమొదటి కేబుల్ బ్రిడ్జి..త్వరలో

రాష్ట్రంలో మొట్టమొదటి కేబిల్ బ్రిడ్జ్ నిర్మాణానికి తెరాస సర్కార్ శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 45 ను హైటెక్ సిటీతో కలుపుతూ హైటెక్ సిటీ సమీపంలోగల దుర్గం చెరువుపై 1.58 కిమీ పొడవుతో నాలుగు వరుసల అత్యాధునికమైన కేబుల్ బ్రిడ్జి నిర్మించడానికి పురపాలక శాఖ పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. సుమారు రూ.150 కోట్లు వ్యయంతో నిర్మించబోయే ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కోసం త్వరలో టెండర్లు పిలువబోతున్నారు.

ఈ కేబుల్ బ్రిడ్జి కావూరి హిల్స్, రహేజా మైండ్ స్పేస్ సెంటర్ లను అనుసంధానం చేస్తుంది. దీనిని స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ పధకం క్రింద ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిర్మించబోతున్నారు. దీని నిర్మాణం కోసం అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నందున టెండర్లు ఖరారు చేయగానే పనులు మొదలుపెట్టవచ్చు. సాంప్రదాయ వంతెనలు నిర్మించడం కంటే ఈ అత్యాధునిక కేబుల్ బ్రిడ్జిలను నిర్మించడం కొంత సులువు కనుక వెంటనే పనులు మొదలుపెడితే వచ్చే ఎన్నికలలో గానే దీని నిర్మాణం పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి రావచ్చు. దీనిని పూర్తి చేయగలిగితే హైదరాబాద్ నగర ప్రజలకు మరింత సౌకర్యంగా ప్రయాణించవచ్చు. దీనితో హైదరాబాద్ నగరానికి, తెరాస సర్కార్ కు కూడా మంచి పేరువస్తుంది.