గత ఏడాది మార్చి 3న పాకిస్తాన్ లో పట్టుబడిన భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ గూడచార్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పాక్ మిలటరీ కోర్టు ఆయనకు ఉరిశిక్ష విదించడంతో భారత్ చాలా తీవ్రంగా స్పందించింది. భారత్ లోని పాక్ హైకమీషనర్ అబుద్ల్ బాసిత్ ను విదేశాంగ కార్యదర్శి ఎస్. జైశంకర్ తన కార్యాలయానికి పిలిపించుకొని పాక్ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేసి, అదే విషయాన్ని లిఖితపూర్వకంగా కూడా ఆయన ద్వారా పాక్ ప్రభుత్వానికి తెలియజేశారు. పాక్ ప్రభుత్వం సహజన్యాయసూత్రాలను కూడా పట్టించుకోకుండా అమాయకుడైన ఒక మాజీ నేవీ అధికారికి ఉరి శిక్ష విదించడాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. పాక్ తన నిర్ణయాన్ని పునః పరిశీలించుకోవాలని కోరారు.
పాక్ చర్యకు ప్రతిచర్యగా ఈ బుదవారం విడుదల చేయవలసిన 12మంది పాక్ ఖైదీలను విడుదల చేయకూడదని నిర్ణయించుకొంది. ఇక శివసేన అధినేత ఉద్దావ్ టాక్రే ఈరోజు డిల్లీ వెళ్ళి హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి ఈ వ్యవహరంపై చర్చించినట్లు సమాచారం. భారత్ కు సేవలు అందించిన కులభూషణ్ జాదవ్ ను కాపాడుకోవడానికి భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా సమర్దిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే భారత్-పాక్ సంబంధాలు దెబ్బ టిని రెండేళ్ళుపైనే అవుతోంది. పాక్ నిర్ణయంతో అవి ఇంకా దెబ్బ తిన్నాయి. ఇదే సమయంలో సరిహద్దుల వద్ద పాక్ సైనికులు మళ్ళీ కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటం, ఉగ్రవాదుల చొరబాటు పెరుగుతుండటం, ఉపఎన్నికల సందర్భంగా అనంతనాగ్ లో ఆందోళనకారులు చెలరేగిపోయి పాఠశాలలకు నిప్పుపెట్టడం వంటి విపరీత పరిణామాలన్నీ ఇరు దేశాలమద్య మళ్ళీ ఉద్రిక్తతలు పెంచేవిగానే కనిపిస్తున్నాయి.