ముస్లిం రిజర్వేషన్ బిల్లుని ఈ బడ్జెట్ సమావేశాలలోనే ప్రవేశపెడతామని కేసీఆర్ గతంలో చాలాసార్లు చెప్పారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల చేత ప్రవేశపెట్టలేకపోయినట్లు చెప్పారు. దాని కోసం వారం రోజులలోగా మళ్ళీ శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారు. కానీ 10 రోజులు గడిచిపోయినా ఆ ఊసే ఎత్తడం లేదు.
దానిని భాజపా బహిరంగంగానే వ్యతిరేకిస్తోంది కనుకనే తెరాస సర్కార్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే తెరాస సర్కార్ ఆ బిల్లుని శాసనసభలో ఆమోదింపజేసుకోగలదు కానీ పార్లమెంటులో ఆమోదింపజేసుకోలేదు. భాజపా దానిని వ్యతిరేకిస్తున్నప్పుడు అసలే సాధ్యం కాదు. బహుశః అందుకే తెరాస సర్కార్ పునరాలోచనలో పడినట్లుంది.
కనుక ప్రస్తుతానికి దానిని పక్కనపెట్టి ఈ నెల 21న కొంపల్లిలో జరుగబోయే తెరాస ప్లీనరీ, ఈనెల 27న వరంగల్ లో తెరాస వ్యవస్థాపక దినోత్సవం కోసం ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నం అయిపోయింది. దీనిపై పార్టీ ప్లీనరీ సమావేశాలలో చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకొనే మాటయితే దానిని వరంగల్ బహిరంగ సభలో ప్రకటించవచ్చు.