తెరాసలో ఎన్నికల వేడి మొదలైందా?

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీలో క్రమంగా ఆందోళన పెరగడం సహజమే. అందుకే అప్పటి నుంచి సంక్షేమ పధకాలపై ఎక్కువ శ్రద్ధ చూపడం మొదలుపెడతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే పని చేస్తున్నట్లున్నారు. రాష్ట్రంలో గర్భిణి స్త్రీలకు కేసీఆర్ కిట్స్, ఒక్కొకరికీ ప్రసవం, పౌషికాహారం ఖర్చుల నిమిత్తం రూ.12,000 నగదు అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచి ‘అమ్మ ఒడి’ పేరుతో ఈ సంక్షేమ కార్యక్రమం ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దాని అమలుకు తగిన ప్రణాళికలు రూపొందించడానికి నేడు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కాబోతున్నారు. 

ఇక బలహీన వర్గాల ప్రజలకు జీవనోపాధి కల్పించేందుకు గొర్రెలు పంపిణీ చేయాలనుకొన్న సంగతి తెలిసిందే. జూన్ నెలలో తొలకరి వర్షాలు పడిన తరువాత లభిదారులకు గొర్రెలు పంపిణీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయవలసిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయబోతున్నారు.