కూట్లో రాయి తీయలేనోడు ఎట్లో రాయి తీస్త అన్నట్లుంది మన విమానయాన శాఖ తీరు. ఎయిర్ ఇండియా ఉన్నతాధికారిని చెప్పుతో కొట్టానని మీడియాకు గొప్ప చెప్పుకొన్న శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ ను ఏమిచేయలేకపోయిన విమానయాన శాఖ, అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇకపై విమాన ప్రయాణికులకు తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా పాస్ పోర్ట్ కలిగి ఉండాలనే నిబంధన విదించబోతోంది. తద్వారా విమాన సిబ్బందితో దురుసుగా వ్యవహరించినవారిని గుర్తించి వారిపై చట్టప్రకారం చర్యలు చేపట్టడానికి వీలవుతుందని భావిస్తోంది.
విమానంలో ప్రయాణించే ప్రయాణికుడు సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తే వెంటనే అతను లేదా ఆమెపై తగిన చర్యలు తీసుకొనేందుకు అవసరమైన చట్టం చేయకుండా, వారు ఎవరో తెలుసుకోవాలనుకోవడం విచిత్రంగా ఉంది. ఎంపి అయినా సామాన్య ప్రయాణికుడైన విమానంలో ఏదైనా సమస్య సృష్టిస్తే, అది మిగిలిన ప్రయాణికులు అందరికీ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కనుక ఆ వ్యక్తి ఎవరు? అతని పదవి లేదా ఉద్యోగం, ఆదాయం, చిరునామా, వయసు వగైరా వివరాలు తెలుసుకోవడం కంటే సదరు వ్యక్తి ఎవరైనప్పటికీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోగలిగామా లేదా? అటువంటి సంఘటనలు పునరావృతం అయితే ఏమి చేయాలి?అని ఆలోచించి ఉండి ఉంటే బాగుండేది.
ఇప్పుడు బస్సు, రైల్వే టికెట్లకు చివరికి క్యాబ్ బుకింగ్ కూడా ఆధార్ నెంబర్ అడుగుతున్నారు కనుక విమాన టికెట్లకు కూడా ఆధార్ తప్పనిసరి చేయడం మంచిదే. కానీ ఆధార్ లేదా పాస్ పోర్ట్ కలిగి ఉండాలనే నిబంధన విదించడం ఈ సమస్యకు పరిష్కారం కానేకాదు. వీలైతే విమాన సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఎంపి రవీంద్ర గైక్వాడ్, తృణమూల్ ఎంపి డోలా సేన్ వంటివారిపై కటిన చర్యలు తీసుకొని చూపాలి గానీ సామాన్య ప్రజలకు కొత్త సమస్యలు సృష్టించడం సరికాదు. దాని వలన విమానయాన సంస్థలే నష్టపోయే ప్రమాదం ఉంది.