ఉప ఎన్నికలు వాయిదాకి అదీ కారణం!

జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నైలోని ఆర్.కె.నగర్ శాసనసభ నియోజకవర్గానికి ఈనెల 12న ఉపఎన్నికలు జరుగవలసి ఉంది. అవి వాయిదా పడ్డాయి. అక్కడ పోటీ చేస్తున్న అధికార, ప్రతిపక్షాల పార్టీల అభ్యర్ధులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు విచ్చలవిడిగా డబ్బు పనుచుతున్నట్లు బలమైన ఆధారాలు లభించడంతో ఉపఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమీషన్ ఆదివారం రాత్రి ప్రకటించింది. 

స్వర్గీయ జయలలితకు తామే అసలైన వారసులమని, అన్నాడిఎంకె పార్టీ తమకే చెందుతుందని శశికళ వర్గం, పన్నీర్ సెల్వం వర్గం వాదిస్తున్న సంగతి తెలిసిందే. కనుక ఈ ఉపఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించడం ద్వారా దానిని నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ ఉపఎన్నికలలో అధికార అన్నాడిఎంకె పార్టీ తరపున శశికళ మేనల్లుడు దినకరన్ పోటీ చేస్తున్నారు. దీనిలో గెలిస్తే ఆయన రాజకీయ భవిష్యత్ సుస్థిరం అవుతుంది. ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఆయన వర్గం విచ్చలవిడిగా డబ్బులు పంచుతోంది. ఈ విషయాన్ని పన్నీర్ సెల్వం వర్గం ఈసి దృష్టికి తీసుకువెళ్ళింది. ఇటీవల తమిళనాడులో జరిగిన ఐటి దాడులలో కూడా దానికి బలమైన ఆధారాలు లభించడంతో ఉపఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమీషన్ ఆదివారం రాత్రి ప్రకటించింది. ఇటువంటి కారణంతో ఎన్నికలు రద్దు చేయడం విశేషమే.