అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా తమ ప్రభుత్వం బాగానే పనిచేస్తోందని, దానిని చూసి ప్రజలు చాలా సంతోషిస్తున్నారని కనుక వచ్చే ఎన్నికలలో మళ్ళీ మనమే తప్పకుండా అధికారంలోకి వస్తామని చెప్పుకోవడం సహజమే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే భుజాలు చరుచుకొంటున్నాయి. అయితే అటువంటి గొప్ప ప్రభుత్వాలను కూడా ఎన్నికలలో ప్రజలు తిరస్కరించడం చూస్తూనే ఉన్నాము.
గతంలో చంద్రబాబు నాయుడే ఆవిధంగా బోల్తా పడి పదేళ్ళపాటు ప్రతిపక్ష బెంచీలలో కూర్చోవలసి వచ్చింది. కానీ అధికారంలోకి రాగానే మళ్ళీ పాత అలవాట్లు కూడా వచ్చేసాయి. తెదేపాకు ఈ ఆటుపోట్లు అలవాటే కనుక వచ్చే ఎన్నికలలో అది ఓడినా తట్టుకోగలదు. కానీ మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తెరాసకు ఇంకా ఆ చేదు అనుభవం రుచి చూడకపోవడం వలన తనదైన శైలిలో ముందుకు సాగిపోతోంది.
తెరాస పాలన గురించి పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి వెలిబుచ్చిన అభిప్రాయం విన్నట్లయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా తెరాస మంత్రులు, నేతలు అందరూ తమ ప్రభుత్వం పట్ల ప్రజలలో నెలకొన్న వ్యతిరేకతను గుర్తించడానికి ఇష్టపడటం లేదా? లేక గుర్తించినా దాని వలన తమ పార్టీకి, ప్రభుత్వానికి నష్టమేమీ ఉండబోదని భావిస్తున్నారా? అనే సందేహం కలుగుతుంది.
“తెరాస మంత్రులు, నేతలు ప్రదర్శిస్తున్న అహంభావాన్ని చూసి మేధావులు సైతం నివ్వెరపోతున్నారు. సామాన్యుల కష్టాలు పట్టించుకోకుండా ఎంతసేపు ప్రజలను మభ్యపెట్టడానికి, గొప్పలు చెప్పుకోవడానికే పరిమితం అవుతున్నారు. ఒకపక్క రైతన్నలు పంటలకు నీళ్ళు లేక గిట్టుబాటు ధరలు రాక విలవిలాడుతున్నా, ఆత్మహత్యలు చేసుకొంటున్నా పట్టించుకోకుండా తెరాస నేతలు ఆత్మస్తుతి, పరనిందతో కాలక్షేపం చేస్తున్నారు. ధర్నా చౌక్ ఎత్తివేసి ప్రజల గొంతు వినబడకుండా అణచివేయాలని చూస్తున్నారు. తెరాస నేతల తీరు మార్చుకోకపోతే ప్రజలే వారికి తగిన గుణపాఠం చెపుతారు,” అని అన్నారు.
ఉత్తం కుమార్ రెడ్డి రాజకీయ ఉద్దేశ్యంతోనే ఈ విమర్శలు చేసినప్పటికీ, అవి ప్రజలలో నెలకొన్న అసంతృప్తి, అసహనానికి అద్దంపడుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా రైతుల విషయంలో ఆయన చెప్పిన మాటలు 100 శాతం వాస్తవం అని అందరికీ తెలుసు. కానీ తెరాస నేతలు వాటిని అంగీకరించకుండా తమ వాక్చాతుర్యంతో ప్రతిపక్షాల నోళ్ళు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. అది నిప్పుని బట్టలలో దాచుకొన్నట్లే అవుతుంది. ప్రతిపక్షాలు మోగిస్తున్న ఈ ప్రమాదఘంటికలను తెరాస నేతలు గుర్తించి ఒకసారి నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకొని, వారు చెపుతున్న సమస్యలు, లోపాలను సరిదిద్దుకొంటే తెరాసకే మంచిది.