తెలంగాణాలో చంద్రబాబు పర్యటన?

ఒకప్పుడు సమైక్య రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణాలో అడుగుపెట్టినా, ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ ఆంధ్రాలో అడుగుపెట్టినా అది అందరికీ చాలా ఆసక్తి, ఆశ్చర్యం కలిగించే గొప్ప వార్తగా మారిపోవడం విశేషమే. 

చంద్రబాబు నాయుడు విజయవాడ తరలివచ్చేసినప్పటి నుంచి చాలా అరుదుగా తెలంగాణాలో అడుగుపెడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో మాత్రం కొన్ని రోజులు గ్రేటర్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తరువాత చాలాసార్లు హైదరాబాద్ వచ్చి వెళ్ళారు కానీ తెలంగాణా జిల్లాలలో పర్యటించే ఆలోచన చేయలేదు. 

తెదేపా తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు చంద్రబాబు నాయుడు శుక్రవారం హన్మకొండలో కాలు మోపారు. హెలికాఫ్టర్ లో వచ్చిన ఆయన స్థానిక సుబేదారి ఆర్ట్స్ కాలేజీ మైదానంలో దిగి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హంటర్ రోడ్డులోని విష్ణు ప్రియ గార్డెన్ కు చేరుకొని వివాహకార్యక్రమంలో పాల్గొన్నారు. నవదంపతులు సూర్య, కుసుమాంజలిని ఆశీర్వదించారు. తెలంగాణా తెదేపా నేతలు అందరూ ఈ వివాహమహోత్సవానికి హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.