మావోలను వీడిన పాటల తూటా

ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ మావోయిస్ట్ పార్టీని విడిచిపెట్టి ప్రజాస్వామ్య పంధాలో పయనించాలని నిర్ణయించుకొన్నట్లు నిన్న ప్రకటించారు. చిరకాలంగా మావోయిస్టులతో పెనవేసుకున్న అనుబంధాన్ని తెంచుకోవడం తనకు చాలా బాధ కలిగిస్తోందని చెప్పారు. మావోయిస్టు పార్టీకి, అమరవీరులకు కన్నీళ్ళతో వందనాలు పలికి శలవు తీసుకొంటున్నానని చెప్పారు. సమాజంలో బడుగు బలహీనవర్గాలకు న్యాయం, రాజ్యాధికారం దక్కడానికి ఇక నుంచి ప్రజాస్వామ్య విధానంలో పనిచేస్తానని చెప్పారు. అందుకోసం మొట్టమొదటగా తన పేరును ఓటరుగా నమోదు చేసుకొన్నానని గద్దర్ చెప్పారు. ఇంతకాలం ఎర్రజెండా పట్టుకొని మార్క్స్ జ్ఞాన సిద్దాంతాన్ని ప్రచారం చేసిన తాను ఆ జెండాను పక్కన పెట్టి బుద్ధుడి జ్ఞాన సిద్దాంతాన్ని, అంబేద్కర్, పూలేల సిద్దాంతాలను ప్రచారం చేస్తానని చెప్పారు. 

అందుకోసం ‘పల్లె నుంచి పార్లమెంటుకు’ అనే పేరుతో త్వరలోనే తాను దక్షిణాది రాష్ట్రాలలో పర్యటించి రెండు లక్షల మంది ప్రజలను కలిసి వారిలో చైతన్యం కలిగిస్తానని చెప్పారు. సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలలో చైతన్యం కల్పించడం ద్వారా వారికి రాజ్యాధికారం, న్యాయం సాధించుకొనేలా కృషి చేస్తానని గద్దర్ చెప్పారు.

గద్దర్ తెరాస సర్కార్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు సాగుతున్నది దొరల పాలన అని, దానిలో అభివృద్ధి పైస్థాయిలోనే సాగుతోందని, కానీ అభివృద్ధి ఎప్పుడూ అట్టడుగు స్థాయి నుంచి మోదలయినప్పుడే సమాజంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ఇప్పుడున్న దొరల తెలంగాణా కోసమా మనం ఆనాడు ప్రాణాలొడ్డి పోరాడాము? అని గద్దర్ ప్రశ్నించారు. ఈ లోపాన్ని సరిదిద్దడానికి రాష్ట్రంలో ప్రత్యమ్నాయ రాజకీయ పార్టీ అవసరం ఉందని గద్దర్ అన్నారు. అయితే తను స్వయంగా రాజకీయ పార్టీ స్థాపించనని, దాని కోసం కృషి చేస్తున్న వారిని అనుసంధానం చేస్తూ పూలదండలో దారంలా ఉంటానని గద్దర్ చెప్పారు. 

గద్దర్ మావోలను వీడి ప్రజాస్వామ్యవిధానంలోకి మారే ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మొదలైనవారు హాజరయ్యారు.