నా అన్న అందరి కష్టాలు తీరుస్తాడు

నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరులో నేడు తెరాస నిర్వహించిన బహిరంగ సభలో ఎంపి కవిత ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ తన సోదరుడు, మంత్రి కేటిఆర్ పై ప్రశంశలు కురిపించారు. అటువంటి గొప్ప సోదరుడు తనకు ఉన్నందుకు తాను చాలా సంతోషం, గర్వపడుతున్నానని అన్నారు. ఆయన తనకు ఒక్కదానికే సోదరుడు కాడని యావత్ తెలంగాణా మహిళలకు అన్నవంటివాడేనని అన్నారు. అయన ప్రజల కష్టాలన్నీ తీరుస్తారని అన్నారు. తన జిల్లాలో మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.350 కోట్లు మంజూరు చేయవలసిందిగా సభా ముఖంగా ఆమె తన సోదరుడికి విజ్ఞప్తి చేయగా, ఆయన వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఈ సందర్భంగా వారిరువురూ గత ప్రభుత్వాల పాలనకు, తమ ప్రభుత్వ పాలనకు తేడాలను వివరించారు. రాష్ట్రం విడిపోతే అధోగతి పాలవుతుందని ఆంధ్రా పాలకులు అన్నారని, కానీ ఎప్పుడో ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయిన రాష్ట్రాల కంటే తెలంగాణాలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి పధంలో దూసుకుపోతోందని మంత్రి కేటిఆర్ చెప్పారు. కనుక తెలంగాణా రాష్ట్రాన్ని డిల్లీ నుంచో అమరావతి నుంచో రిమోట్ పద్దతిలో పాలించే పార్టీలు, ప్రభుత్వాలు మనకు అక్కరలేదని, ఇంటిపార్టీ అయిన తెరాస ఒక్కటి చాలని అన్నారు. తమ ప్రభుత్వం చేసి చూపిస్తున్న ఈ అభివృద్ధిని చూస్తున్నవారు, దాని ఫలాలను పొండుతున్న ప్రజలు అందరూ తమను, తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కేటిఆర్ కోరారు.