సోదర సోదరీమణుల్లారా...

రాజకీయనేతలు ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించేటప్పుడు “సోదర సోదరీమణుల్లారా...” అంటారు. కానీ ఇవ్వాళ్ళ ఆర్మూర్ ప్రజలకు కూడా వక్తలను ఉద్దేశ్యించి “సోదర సోదరీమణుల్లారా...”అనే అవకాశం లభించింది. ఎందుకంటే ఈరోజు జరుగబోయే బహిరంగసభలో మంత్రి కేటిఆర్, ఆయన సోదరి కవిత పాల్గొంటున్నారు. వారిరువురూ ఒకే కుటుంబానికి.. పార్టీకి చెందినవారైనప్పటికీ ఇంతవరకు ఒక్కసారి కూడా వేదిక పంచుకోలేదు. మొట్టమొదటిసారిగా ఆర్మూర్ సభలోనే ఇద్దరూ ఒకే వేదికపై నుంచి ప్రసంగించబోతున్నారు. 

మంత్రి కేటిఆర్ నిజామాబాద్ పర్యటన చేస్తున్న సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నారు. కవిత ప్రాతినిద్యం వహిస్తున్న లోక్ సభ నియోజక వర్గం కనుక నేటి సాయంత్రం జరుగబోయే సభలో కవిత కూడా పాల్గొంటున్నారు. అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ మంచి వాక్చాతుర్యం ఉన్నవారే. తమ ప్రభుత్వ పనితీరును గట్టిగా సమర్ధించుకొంటూ, తమపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలను గట్టిగా త్రిప్పికొడుతూ అద్భుతంగా మాట్లాడగలరు. కనుక అందరినీ ఆకట్టుకొనే వారి ప్రసంగాలు వినేందుకు సహజంగానే ప్రజలు ఆసక్తి చూపిస్తారు కనుక బారీ సంఖ్యలోనే ప్రజలు తరలివచ్చే అవకాశమే ఉంది. ఈరోజు సాయంత్రం స్థానిక మినీ స్టేడియంలో జరుగబోతున్న ఈ సభకు స్థానిక తెరాస నేతలు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.