వికారాబాద్ జిల్లాలోని తాండూరులో నిన్న తెలంగాణ జనహిత జాగృతి బహిరంగ సభ జరిగింది. ఈ సభకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశ్యించి మంత్రి కేటిఆర్ చేసిన ప్రసంగంలో ప్రాజెక్టులకు అవరోధాలు సృష్టిస్తున్న కాంగ్రెస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“కాంగ్రెస్ హయంలో తెలంగాణాకు తీరని అన్యాయం జరిగింది. దాని హయంలో ఎప్పుడు చూసినా విద్యుత్ కోతలే. ఆ కారణంగా అటు పరిశ్రమలు, ఇటు వ్యవసాయం రెండూ తీవ్రంగా నష్టపోయాయి. కాంగ్రెస్ హయంలో సాగు, త్రాగునీటికి కటకట, విత్తనాలు, ఎరువుల కొరత..ఒకటేమిటి ఏ రంగంలో చూసినా అవినీతి, అసమర్దతే కనిపించేది తప్ప ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కనబడేది కాదు. కాంగ్రెస్ తన హయంలో తెలంగాణాకు తీరని అన్యాయం చేయడమే కాకుండా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా రాష్ట్రానికి, ప్రజలకు నష్టం కలిగించేవిధంగా వ్యవహరిస్తోంది.
మా ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టి కోటి ఎకరాలకు నీళ్ళు అందించాలని ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ నేతలు కోర్టులలో కేసులు వేసి వాటిని అడ్డుకొంటున్నారు. అయితే ఆ కేసులు మాకు ‘స్పీడ్ బ్రేకర్లు’ మాత్రమే. కాంగ్రెస్ సృష్టిస్తున్న ఈ సమస్యలను అన్నిటినీ అధిగమించి ఏవిధంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలో మాకు బాగా తెలుసు. మా పని మేము చేసుకొనిపోతాము. ఫలితాలు చూసి మీరే (ప్రజలే) కాంగ్రెస్ నేతలకు తగిన విధంగా బుద్ధి చెప్పాలి.
తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా లక్షల ఎకరాలకు సాగునీరు అందించాము. అలాగే రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తున్నాము. పగలు రాత్రి అనే తేడా లేకుండా నిరంతరంగా రైతులకు విద్యుత్ అందిస్తున్నాము. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పధకాలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాము. ఇంకా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేస్తున్నాము. వాటి ఫలితాలను మీరే స్వయంగా చూస్తున్నారు.
తెలంగాణాలో ఇక కాంగ్రెస్, తెదేపాలకు ఆయువు ముగిసినట్లే. రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మన ఇంటి పార్టీ తెరాసకే అపూర్వమైన ప్రజాధారణ ఉంది కనుక మన పార్టీని, మన రాష్ట్రాభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు,” అని మంత్రి కేటిఆర్ అన్నారు.