ఛత్తీస్ ఘర్ నుంచి తెలంగాణా రాష్ట్రానికి ఒకటి రెండు రోజుల్లో విద్యుత్ సరఫరా మొదలయ్యే అవకాశాలున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో నవంబర్ 2014లో తెరాస సర్కార్ 1000 మెగావాట్స్ విద్యుత్ సరఫరా కోసం ఒక ఒప్పందం కుదుర్చుకొంది. ఛత్తీస్ ఘర్ నుంచి 12 ఏళ్ళపాటు విద్యుత్ కొనుగోలు చేసేందుకు సెప్టెంబర్ 2015లో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మద్య మరొక ఒప్పందం జరిగింది.
ఛత్తీస్ ఘర్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా కోసం వార్ధా-డిచ్ పల్లి మద్య 765 కెవి డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ నిర్మించారు. దానిలో డిచ్ పల్లి-మహేశ్వరం లింక్ పనులు పూర్తికావడానికి మరికొంత సమయం పడుతుంది. కానీ ఈలోపుగా వార్ధా-డిచ్చిపల్లిలైన్స్ ద్వారా చత్తిస్ ఘర్ నుంచి 100-200 మెగావాట్స్ విద్యుత్ ని స్వీకరించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు శ్రీరామనవమి శుభ సందర్భంగా ఛత్తీస్ ఘర్ నుంచి విద్యుత్ సరఫరా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఛత్తీస్ ఘర్ విద్యుత్ శాఖ అధికారులు కూడా విద్యుత్ సరఫరా కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉభయ రాష్ట్రాల విద్యుత్ అధికారులు నిరంతరం సంప్రదించుకొంటూ విద్యుత్ సరఫరాకు అవసరమైన అన్ని ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఒకవేళ ఛత్తీస్ ఘర్ నుంచి సాంకేతిక కారణాల చేత రేపు విద్యుత్ సరఫరా కాలేకపోయినా ఈ వారంలో తప్పకుండా మొదలవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులు చెపుతున్నారు. రాష్ట్రంలో ఎండలు, వేడి పెరుగడంతో విద్యుత్ వినియోగం కూడా పెరిగిపోయింది. కనుక ఈ సమయంలో ఛత్తీస్ ఘర్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్ వలన కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ అందించడానికి వీలుకలుగుతుంది.