తెరాస అధికారంలోకి వచ్చిన కొత్తలో రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉండేది. దానిని నివారణకు అది చేపట్టిన అనేక చర్యల వలన ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేదు. ఆ చర్యలలో భాగంగా పొరుగునే ఉన్న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుంచి 1000 మెగావాట్స్ విద్యుత్ కొనుగోలు కూడా ఒకటి. అయితే ఆ రాష్ట్రం నుంచి తెలంగాణాకు తగినంత సామర్ధ్యం గల విద్యుత్ లైన్లు లేకపోవడంతో ఇంతవరకు విద్యుత్ సరఫరా మోదలవలేదు. కానీ విద్యుత్ లైన్ల నిర్మాణం పూర్తయింది కనుక గత రెండు మూడు రోజులుగా విద్యుత్ సరఫరా ట్రయల్ రన్స్ కూడా మొదలయ్యాయి.
అయితే ఛత్తీస్ ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం, దాని కోసం ఆ ప్రభుత్వంతో కుదుర్చుకొన్న ఒప్పందంలో షరతుల వలన తెలంగాణా రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం ఉండదని విద్యుత్ నిపుణులు సైతం వాదిస్తున్నారు. అది తెలంగాణా ప్రభుత్వం మెడకి గుదిబండలా మారే ప్రమాదం ఉంటుందని పదేపదే హెచ్చరిస్తున్నారు. కానీ తెలంగాణా ప్రభుత్వం ఈ విషయంలో వెనకడుగువేసే ఉద్దేశ్యమే లేదన్నట్లు ముందుకే సాగుతోంది.
కనుక దీనిపై కాంగ్రెస్ మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హైకోర్టులో ఒక పిటిషన్ వేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. కేంద్రప్రభుత్వం ఒక యూనిట్ విద్యుత్ రూ.4.25 చొప్పున సరఫరా చేయడానికి ముందుకు వచ్చినప్పుడు దానిని కాదని ఛత్తీస్ ఘడ్ నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయవలసిన అవసరం ఏమిటని పొన్నాల ప్రశ్నించారు. పైగా ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో మిగులు విద్యుత్ ఉన్న కారణంగా తక్కువ ధరకే విద్యుత్ లభిస్తున్నప్పుడు తెరాస సర్కార్ ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయాలనుకొంటోందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హడావుడిగా వెళ్ళి ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వంతో చేసుకొన్నా అనాలోచిత ఒప్పందం కారణంగా రాష్ట్రానికి ఏటా 1000 కోట్లు నష్టం కలుగుతుందని ఆరోపించారు. 12 ఏళ్ళపాటు ఆ భారాన్ని సామాన్య ప్రజలే మోయవలసి ఉంటుందని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయాలనుకొంటున్నాని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.