మోడీ సందేశం మంచిదే..కానీ పాటించేదెవరు?

జమ్మూ-శ్రీనగర్ మద్య రూ.9,000 కోట్లు ఖర్చు చేసి 9 కిమీ పొడవైన సొరంగమార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. ప్రపంచంలోకెల్లా అత్యాదునికమైన 5 సొరంగ మార్గాలలో ఇది కూడా ఒకటి. దీని వలన జమ్మూ-శ్రీనగర్ మద్య దూరం సుమారు 31 కిమీ తగ్గుతుంది. శీతాకాలంలో విపరీతంగా మంచు కురుస్తున్న సమయంలో కూడా సురక్షితంగా రాకపోకలు సాగించడానికి వీలుగా ఈ సొరంగమార్గం నిర్మించబడింది. 

ఈ సందర్భంగా ఉదంపూర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కాశ్మీర్ యువతకు చక్కటి సందేశం ఇచ్చారు. వారు సుఖసంతోషాలతో జీవించేందుకు పర్యాటక రంగాన్ని ఎంచుకొంటారో లేక భవిష్యత్ ను అందకారంగా మార్చేసే ఉగ్రవాదాన్ని ఎంచుకొంటారో తేల్చుకోవాలని అన్నారు. దశాబ్దాలుగా కాశ్మీర్ లో జరుగుతున్న హింస, రక్తపాతం వలన ఇక్కడి ప్రజలే ఎంతగానో నష్టపోయారని కనుక కాశ్మీరీ యువత ఇకనైనా వేర్పాటువాదాన్ని విడనాడి రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకొని తమ జీవితాలలో కూడా వెలుగులు నింపుకోవాలని కోరారు. 

కాశ్మీర్ లో కొందరు యువకులు పోలీసులు, భద్రతాదళాలపై రాళ్ళు తువ్వుతుంటే, మరికొందరు యువకులు ఈ సొరంగ మార్గం నిర్మించేందుకు బండరాళ్ళను పగులగొట్టి అభివృద్ధికి బాటలు పరిచారని ప్రధాని మోడీ అన్నారు. ఈ హింస, వేర్పాటువాదం లేకపోయుంటే ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలలో కాశ్మీర్ ఒకటిగా నిలిచి ఉండేదని, దాని వలన కాశ్మీర్ ప్రజలకే ఎక్కువ మేలు కలిగి ఉండేదని అన్నారు. గత 4 దశాబ్దాలుగా సాగుతున్న ఈ హింస, వేర్పాటువాదం వలన ఏ ప్రయోజనం ఉండదని రుజువైందని అన్నారు. కనుక తమ జీవితాలను అగమ్యగోచరంగా మారుస్తున్న వేర్పాటువాదానికి కాశ్మీర్ యువత దూరంగా ఉండాలని ప్రధాని మోడీ కోరారు. వారు సహకరిస్తే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయని అన్నారు. తనను తాను రక్షించుకోలేని దుస్థితిలో ఉన్న పాకిస్తాన్ ను నమ్మడం కంటే పర్యాటకరంగాన్ని నమ్ముకొంటే కాశ్మీరీ కుటుంబాలలో మళ్ళీ వెలుగులు నిండుతాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యావత్ భారతీయులు తమ జీవితంలో ఒక్క సారైనా కాశ్మీర్ లో పర్యటించాలని కోరుకొంటారని, కనుక కాశ్మీరీ యువత వేర్పాటువాదాన్ని విడనాడి పర్యాటక రంగంపై దృష్టి సారిస్తే కాశ్మీర్ మళ్ళీ పర్యాటకులతో కళకళలాడుతుందని అన్నారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఎటువంటి సహాయసహకారాలు కావాలన్నా అందించేందుకు కేంద్రప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.