కేటిఆర్ ని ముఖ్యమంత్రి చేస్తే మద్దతు ఇస్తా! హరీష్ రావు

రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కేటిఆర్ తో భేధాభిప్రాయాల గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెపుతూ, “అటువంటి పుకార్లు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి కానీ మామద్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. కేసీఆర్ ఏమి చేపిది అది చేయడమే నా పని. అంతకంటే ఎక్కువ ఆలోచనలు చేయను. మా అందరి లక్ష్యం బంగారి తెలంగాణా సాధన మాత్రమే,” అని చెప్పారు. 

పార్టీలో రెండవ స్థానం గురించి మీకు, కేటిఆర్ కు మద్య పోటీ నెలకొందన్న మాట వాస్తవమేనా? అనే ప్రశ్నకు సమాధానంగా “తెరాసలో ఆ సమస్య లేదు. కనీసం మరో పదేళ్ళ వరకు కేసీఆర్ మా నాయకుడే. అందరూ కేసీఆర్ నాయకత్వంలో సైనికులలాగ పనిచేసుకొని పోతుంటాము,” అని హరీష్ రావు చెప్పారు.  

ఒకవేళ కేసీఆర్ తన కొడుకు కేటిఆర్ ను ముఖ్యమంత్రిగా చేయాలనుకొంటే మీరు అంగీకరిస్తారా లేక వ్యతిరేకిస్తారా? అనే ప్రశ్నకు “కేసీఆర్ దయ వలననే నేను ఈ స్థాయికి ఎదగగలిగాను. నేడు నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడిందంటే అది కేసీఆర్ వలననే. కనుక ఆయన ఏ నిర్ణయం తీసుకొన్నా మరొక ఆలోచన లేకుండా సమర్దిస్తాను. ఒకవేళ కేటిఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనుకొంటే తప్పకుండా సమర్దిస్తాను. ఆ కుర్చీలో ఆయన ఎవరిని కూర్చోబెడితే వారికి మద్దతు ఇస్తాను,” అని హరీష్ రావు అన్నారు.