ఒక దేశంలో ఉన్న ఒక ప్రాంతం లేదా భవనాలపై వేరే దేశానికి హక్కు కలిగి ఉంటుందా? అది సాధ్యమేనా? అంటే కాదనే చెప్పవచ్చు. కానీ పాకిస్తాన్ పితామహుడుగా పేరొందిన మొహమ్మద్ అలీ జిన్నాకు చెందిన ముంబైలోని నివాసంపై తమకే సర్వాధికారాలు ఉన్నాయని పాక్ వాదిస్తోంది. వాదించడమే కాదు..తమ హక్కును భారత ప్రభుత్వం గౌరవించాలని కూడా కోరుతోంది.
ఒకప్పుడు జిన్నా నివాసమైన ఆ ఇంటికి చారిత్రిక ప్రాధాన్యంగలదనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే దాని నిర్వహణ కోసం భారత ప్రభుత్వం ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది. దాని నిర్వహణ ప్రభుత్వానికి గుదిబండగా మారినందున దానిని కూల్చివేసి దాని స్థానంలో మహారాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలను ఉట్టిపడేవిధంగా సాంస్కృతిక భవనం నిర్మించాలని భాజపా ఎమ్మెల్యే లోదా ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంగతి తెలియగానే పాక్ ప్రభుత్వం ఆ భవనాన్ని తమకు అప్పగించాలని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీద్ జకారియా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను కోరారు. దీనిపై భారత ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
ఇక అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చైనా చాలా కాలంగానే వాదిస్తోంది. కనుక అక్కడికి బౌద్ద గురువు దలైలామాను పంపించవద్దని, పంపిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని భారత్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ పై తమ సార్వభౌమత్వాన్ని నిరూపించుకొనే ప్రయత్నంలో చాలాసార్లు చైనా సైనికులు లోపలకి చొచ్చుకువచ్చి అక్కడ కొంతసేపు హడావుడి చేసి వెళుతుంటారు. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో చైనా ఒక బారీ అంతర్జాతీయ రహదారిని నిర్మిస్తోంది. దానిపై భారత్ చెపుతున్న అభ్యంతరాలను ఖాతరు చేయని చైనా, అరుణాచల్ ప్రదేశ్ విషయంలో తమ అభ్యంతరాలను భారత్ గౌరవించాలని డిమాండ్ చేస్తుండటం విడ్డూరంగా ఉంది.