కేసీఆర్ కి అంత ప్రచారయావ దేనికో?

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పొందిన మహిళకు ఫోన్ చేసి ఇంటి గురించి ఆమె అభిప్రాయం అడిగి తెలుసుకొన్నారు. అది మీడియాలో చాలా ప్రముఖంగా ప్రసారం చేయబడింది. దానిపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ స్పందిస్తూ “కేసీఆర్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా ఇంతవరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం మొదలుపెట్టలేదు కానీ ఏవో కొన్ని ఇళ్ళు నిర్మించి ఇచ్చి ఎంపిక చేసిన ఒక లబ్దిదారుతో ఫోన్ లో మాట్లాడి దాని గురించి మీడియాలో ప్రచారం చేసుకొన్నారు. ఇటువంటి చవుకబారు ట్రిక్కులతో ప్రజలను ఎక్కువకాలం మోసం చేయలేరని ఆయన గ్రహిస్తే మంచిది,” అని అన్నారు. 

“వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మిర్చి రైతులు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో గత రెండు వారాలుగా తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. తాము కష్టపడి పండించి తెచ్చిన మిర్చీ బస్తాలను తగులబెట్టుకొంటున్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చీమకుట్టినట్లు అయినా లేదు. కనుక మిర్చి రైతులకు తెదేపా అండగా నిలబడి సోమవారం అన్ని జిల్లా కలెక్టరేట్లను ముట్టడిస్తుంది. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలి. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా మాటలతో మభ్యపెట్టాలని చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలే తగినవిధంగా బుద్ధి చెపుతారు,” అని ఎల్. రమణ అన్నారు.