సమ్మెకు సిద్దం అవుతున్న సింగరేణి

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు వీలుకల్పిస్తూ తెరాస సర్కార్ జారీ చేసిన నోటిఫికేషన్ కు హైకోర్టు బ్రేకు వేయడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దానితో సింగరేణి కార్మికులు తీవ్ర నిరాశ చెందారు. ఆ హక్కును సాధించేందుకు వారు సమ్మె బాట పట్టడానికి సిద్దం అవుతున్నారు.

కార్మిక చట్టాల గురించి సరైన అవగాహన లేని కొందరు ముఖ్యమంత్రి కేసీఆర్ ను తప్పుదారి పట్టించడం వలననే ఈ సమస్య తలెత్తిందని మణుగూరు కాలరీస్ ఏరియా కార్మిక సంఘం నాయకులు నామా వెంకటేశ్వర రావు, రామ్ గోపాల్, అంజయ్య విమర్శించారు. వి.ఆర్.ఎస్ కు చట్టబద్దత కల్పించి ఉండి ఉంటే ఈ పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చేది కాదని అన్నారు. సింగరేణి కాలరీస్ యూనియన్ ఎన్నికలలో గెలిచేందుకే అధికార పార్టీలో కొందరు నేతలు హడావుడిగా ప్రభుత్వం చేత ఈ నిర్ణయం ప్రకటింపజేసినందునే ఇది ఈవిధంగా బెడిసికొట్టిందని అన్నారు. ప్రభుత్వం నిజంగానే సింగరేణి కార్మికుల సంక్షేమం కోరుకొంటున్నట్లయితే కనీసం ఇప్పటికైనా అన్ని కార్మిక సంఘాల ప్రతినిధుల సలహాలు, సూచనలను అడిగి తీసుకొని వాటి ప్రకారం వి.ఆర్.ఎస్ కు చట్టబద్దత కల్పించి, వారసత్వ ఉద్యోగాలకు మార్గం సుగమం చేయాలని, 10వ వేజ్ బోర్డును వెంటనే అమలుచేయాలని  కోరారు. ఒకవేళ ప్రభుత్వం తమ అభ్యర్ధనను తేలికగా తీసుకొని పట్టించుకోకపోతే, తాము సమ్మెకు దిగవలసివస్తుందని వారు హెచ్చరించారు. సమ్మెకు మొదటి హెచ్చరికగా గురువారం పంచ్ ఎంట్రీ మరియు గనుల ఎంట్రీల వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికులు కొద్దిసేపు ధర్నాలు చేశారు.